ఎట్టకేలకు ‘రాసా’పై వేటు
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:55 AM
గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ (జీటీఎస్) నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ‘రాసా’ సంస్థపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఎట్టకేలకు వేటు వేశారు.
చీమలాపల్లి, టౌన్‌కొత్తరోడ్డు జీటీఎస్ నిర్వహణ టెండర్లు రద్దు
రెండుచోట్ల యంత్రాలు, వాహనాల మరమ్మతుకు అయ్యే ఖర్చును ఆ సంస్థకు చెల్లించాల్సిన బిల్లు నుంచి రికవరీ చేస్తూ ప్రతిపాదనలు పంపాలని అధికారులకు కమిషనర్ ఆదేశం
ఎల్2కి చీమలాపల్లి జీటీఎస్ నిర్వహణ బాధ్యతలు
టౌన్‌కొత్తరోడ్డు జీటీఎస్ నిర్వహణకు మళ్లీ టెండరు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ (జీటీఎస్) నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ‘రాసా’ సంస్థపై జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఎట్టకేలకు వేటు వేశారు. టౌన్‌కొత్తరోడ్డు, చీమలాపల్లి జీటీఎస్‌ల నిర్వహణ దక్కించుకున్న ఆ సంస్థ నెలలు గడుస్తున్నాసరే పనులు ప్రారంభించకపోవడంతో టెండర్లను రద్దు చేశారు. గతంలో ఆ సంస్థ నిర్వహించిన గాజువాక, టౌన్‌కొత్తరోడ్డు జీటీఎస్‌లో యంత్రాలు, వాహనాల మరమ్మతుకు అయ్యే ఖర్చును ఆ సంస్థకు చెల్లించాల్సిన బిల్లు నుంచి రికవరీ చేస్తూ ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.
నగర పరిధిలో నివాసాలు, దుకాణాల నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను శాస్ర్తీయ పద్ధతిలో పర్యావరణహితంగా డంపింగ్ యార్డుకు తరలించేందుకు వీలుగా జోనల్ కార్యాలయాల పరిధిలో గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ (జీటీఎస్)లను ఏర్పాటుచేశారు. జీటీఎస్‌లకు క్లాప్ వాహనాల ద్వారా చేరిన చెత్తను క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్ (సీసీఎస్) విధానంలో బయటకు కనిపించని విధంగా కేక్‌మాదిరిగా యంత్రాలతో కంప్రెస్ చేసి కంటెయినర్‌లాంటి వాహనం (హుక్ లోడర్) ద్వారా కాపులుప్పాడలోని డంపింగ్ యార్డుకు తరలిస్తారు. జీటీఎస్‌లలో సీసీఎస్ యంత్రాలతోపాటు హుక్‌లోడర్లను జీవీఎంసీయే సమకూర్చి, వాటి నిర్వహణను కాంట్రాక్టర్లకు టెండర్ ద్వారా అప్పగిస్తూవస్తోంది. వాహనాలకు డీజిల్ కాకుండా ఏటా సగటున ఒక్కో ప్రాజెక్టుకు రూ.1.8 కోట్లు వరకూ కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది.
గత ఏడాది గాజువాక, టౌన్‌కొత్తరోడ్డు, చీమలాపల్లిలోని జీటీఎస్ కేంద్రాల నిర్వహణను ‘రాసా’, ముడసర్లోవలోని జీటీఎస్ నిర్వహణను ‘మంజునాథ’ సంస్థ దక్కించుకున్నాయి. అయితే ‘రాసా’ సంస్థ తాను నిర్వహిస్తున్న జీటీఎస్ కేంద్రాల్లో చెత్తను హుక్‌లోడర్ల ద్వారా కాకుండా ఓపెన్ టిప్పర్లతో కాపులుప్పాడలోని డంపింగ్‌యార్డుకు తరలిస్తుండేది. అంతేకాకుండా చెత్తను ఎప్పటికప్పుడు కాపులుప్పాడ తరలించకుండా నిర్లక్ష్యం వహించడంతో జీటీఎస్ కేంద్రాల్లో కుప్పలు పేరుకుపోయి పారిశుధ్య సమస్య తలెత్తింది. స్థానికులు ఆందోళన వ్యక్తంచేయడంతో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ కొన్నాళ్ల కిందట ఆకస్మికంగా టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక జీటీఎస్ కేంద్రాలను తనిఖీ చేయగా, అక్కడ నుంచి చెత్తను తరలించేందుకు జీవీఎంసీ సమకూర్చిన హుక్ లోడర్లు కనిపించలేదు. వాటి గురించి ఆరా తీయగా...కొన్ని వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురై పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్టు, మరొక వాహనం నెలల తరబడి గ్యారేజీలో ఉండిపోయినట్టు సిబ్బంది సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ ఆ వాహనాలు చెత్తను నిత్యం కాపులుప్పాడ తరలిస్తున్నట్టు చూపించి వాటి పేరున డీజిల్‌ను జీవీఎంసీ నుంచి డ్రా చేస్తున్నట్టు తేలడంతో కమిషనర్ సీరియస్ అయ్యారు. ఆ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నందున అదనంగా డ్రా చేసిన డీజిల్‌తోపాటు చెత్తను హుక్ లోడర్లతో తరలిస్తున్నట్టు డ్రా చేసుకున్న మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి ‘రాసా’ సంస్థ గాజువాక, టౌన్‌కొత్తరోడ్డు జీటీఎస్‌ల నిర్వహణను గాలికి వదిలేసింది. మళ్లీ 2026 సంవత్సరానికి జీటీఎస్‌ల నిర్వహణకు మూడు నెలల కిందట జీవీఎంసీ టెండర్లు పిలవగా, అదే సంస్థ టౌన్‌కొత్తరోడ్డు, చీమలాపల్లి కేంద్రాల నిర్వహణ టెండర్లు దక్కించుకుంది.
పని ప్రారంభించకపోయినా ’రాసా’పై అధికారులు అపారప్రేమ:
‘రాసా’ సంస్థకు కేటాయించిన రెండు జీటీఎస్‌ల నుంచి నెలలు గడుస్తున్నా చెత్త తరలింపు జరగకపోవడంతో స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో జీవీఎంసీ అధికారులు ఓపెన్‌టిప్పర్లతో చెత్తను కాపులుప్పాడ తరలిస్తూ వచ్చారు. కమిషనర్ ఆదేశించినా ఇంతవరకూ అధికారులు బిల్లు రికవరీ చేయకపోవడం, మూడు నెలలు కిందట టెండరు దక్కించుకుని పనులు ప్రారంభించకపోయినా పట్టించుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎట్టకేలకు రాసా సంస్థకు టెండర్లు రద్దుచేస్తూ ఇంజనీరింగ్ అధికారులు పంపిన ప్రతిపాదనలను కమిషనర్ ఆమోదించారు. ఆ సంస్థ తర్వాత తక్కువ కోట్ చేసి కాంట్రాక్టర్‌కు ఆయా పనులు అప్పగించాలని ఆదేశించారు. ఇదిలావుండగా గాజువాక జీటీఎస్‌లో యంత్రాల మరమ్మతుకు రూ.49 లక్షలు ఖర్చవుతుందని ఇంజనీర్లు అంచనా వేయడంతో ఆ మొత్తంతోపాటు గతంలో డీజిల్ దుర్వినియోగానికి సంబంధించిన రూ.49 లక్షలు కూడా ‘రాసా’ నుంచి రికవరీ చేసేలా ప్రతిపాదనలు తయారుచేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.