ఎట్టకేలకు తీపి కబురు
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:40 AM
అనకాపల్లి సమీపంలోని చెర్లోపలి ఖండం సమగ్ర టౌన్‌షిప్ (ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్) ప్రాజెక్టుకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. చెర్లోపలి లేఅవుట్‌కు భూములు ఇచ్చిన రైతులకుు అనుకూలంగా రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
చెర్లోపలి లేఅవుట్ అభివృద్ధికి మంత్రిమండలి పచ్చజెండా
భూ సమీకరణలో రైతులకు అనుకూలంగా నిర్ణయం
అందరికీ ఒకే విధంగా రిటర్నబుల్ ప్లాట్లు
1,600 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం
వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో త్వరలో లేఅవుట్ అభివృద్ధి పనులు
అనకాపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి సమీపంలోని చెర్లోపలి ఖండం సమగ్ర టౌన్‌షిప్ (ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్) ప్రాజెక్టుకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. చెర్లోపలి లేఅవుట్‌కు భూములు ఇచ్చిన రైతులకుు అనుకూలంగా రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో టౌన్‌షిప్ ఏర్పాటు పనులకు అడ్డంకులు తొలగాయి. దాదాపు రెండు దశాబ్దాల నుంచి నిరీక్షిస్తున్న రైతులకు, వీఎంఆర్‌డీఏ అధికారులు త్వరలో అభివృద్ధి చేసిన ప్లాట్లను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ (వుడా... ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ) 2007లో భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) కింద చెర్లోపలి ప్రాంతంలో 56 ఎకరాల్లో సమగ్ర టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో 1,600 చదరపు గజాలు నివాస స్థలం, 200 చదరపు గజాలు వాణిజ్య స్థలం కేటాయిస్తామని అప్పట్లో వుడా అధికారులు చెప్పారు. ఇందుకు దాదాపు 40 ఎకరాలకు సంబంధించిన రైతులు ల్యాండ్ పూలింగ్‌కు ముందుకు వచ్చారు. మిగిలిన 16 ఎకరాలకు సంబంధించిన రైతులు ఒప్పుకోలేదు. దీంతో లేఅవుట్ పనులు మొదలుకాలేదు. తరువాత 2010 నుంచి 2016 వరకు ముసాయిదా నోటిఫికేషన్లు, లేఅవుట్ ప్రణాళికలు సిద్ధమైనప్పటికీ ల్యాండ్ పూలింగ్‌కు మిగిలిన రైతులు ముందుకు రాకపోవడంతో ప్రాజెక్టులో కదలిక లేదు. కాగా అప్పట్లో ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతులు.. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వుడా (వీఎంఆర్‌డీ) అధికారులు లేఅవుట్‌ను అభివృద్ధి చేయకపోవడంతో తమకు ప్లాట్లు ఇవ్వలేదని, పోనీ భూములను అమ్ముకుందామంటే వీలుకాని పరిస్థితి నెలకొందని చెప్పారు. కొణతాల రామకృష్ణ వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తరువాత మిగిలిన 16 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా ల్యాండ్ పూలింగ్‌కు ముందుకు రావడంతో లేఅవుట్‌కు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో భూములు ఇచ్చిన రైతుల మాదిరిగానే ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులకు కూడా 1,600 చదరపు గజాల నివాస స్థలం, 200 చదరపు గజాల వాణిజ్య స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఆమోదించింది. వీఎంఆర్‌డీఏ అధికారులు లేఅవుట్‌ను అభివృద్ధిచేసి, ఒప్పందం ప్రకారం ఆయా రైతులకు త్వరలో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తారని సమాచారం. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులు బుద్ద రమణాజీ, పెంటకోట సూర్యప్రకాశ్, బుద్ద మహాలక్ష్మినాయుడు తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.