Share News

ఎట్టకేలకు కొత్తపొలం రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:01 PM

పాడేరు మండలం మారుమూల కొత్తపొలం రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. స్థానిక ఘాట్‌ మార్గంలో అమ్మవారి పాదాలుకు సమీప కాఫీ తోటల్లోంచి కొత్తపొలం వెళ్లేందుకు సుమారుగా మూడు కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంది.

ఎట్టకేలకు కొత్తపొలం రోడ్డుకు మోక్షం
డిప్యూటీ సీఎం రాకతో మెరుగు పడిన కొత్తపొలం రోడ్డు

డిప్యూటీ సీఎం నందిగరువు పర్యటనతో మెరుగుపడిన మార్గం

ఓనూరు జంక్షన్‌ నుంచి కొత్తపొలానికి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చిన పవన్‌కల్యాణ్‌

ఆనందం వ్యక్తం చేస్తున్న ఓనూరు, నందిగరువు, కొత్తపొలం వాసులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు మండలం మారుమూల కొత్తపొలం రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. స్థానిక ఘాట్‌ మార్గంలో అమ్మవారి పాదాలుకు సమీప కాఫీ తోటల్లోంచి కొత్తపొలం వెళ్లేందుకు సుమారుగా మూడు కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉంది. ఆ మార్గంలోనే ఓనూరు, నందిగరువు, కొత్తపొలం వాసులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే అది రెండు దశాబ్దాల క్రితం నిర్మించినది కావడంతో ప్రస్తుతం రాళ్లు తేలి, గుంతలతో అధ్వానంగా ఉంది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు ఓనూరు, నందిగరువు, కొత్తపొలం వాసులతో పాటు అటుగా ఉన్న మరికొన్ని గ్రామాలకు చెందిన గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఆ రోడ్డును మెరుగుపరచాలని ఆయా ప్రాంతీయులు చాలా ఏళ్లుగా కోరుతున్నా ఫలితం లేకపోయింది.

డిప్యూటీ సీఎం రాకతో బాగుపడిన రోడ్డు

డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నందిగరువు పర్యటనతో కొత్తపొలం రోడ్డుకు కొంత వరకు మోక్షం కలిగింది. పవన్‌కల్యాణ్‌ నందిగరువు చేరుకునేందుకు గతుకులుగా ఉన్న కొత్తపొలం రోడ్డుపై ప్రయాణించాల్సి ఉండడంతో, ఘాట్‌ మార్గం నుంచి ఓనూరు జంక్షన్‌ వరకు ఉన్న ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, వాహనాల రాకపోలకు అనువుగా మెరుగుపరిచారు. దీంతో ప్రస్తుతానికి కొత్తపొలం రోడ్డు సగం బాగుపడింది. కాగా నందిగరువు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు తమ రోడ్డు సమస్యను కొత్తపొలం వాసులు తెలిపారు. స్పందించిన ఆయన రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడతామని గిరిజనులకు హామీ ఇచ్చారు. దీంతో భవిష్యత్తులో కొత్తపొలం రోడ్డు మొత్తం అభివృద్ధి జరిగే పరిస్థితి ఉండడంతో ఆయా ప్రాంతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 19 , 2026 | 11:01 PM