Share News

ఎట్టకేలకు మెట్టపాలెం రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:33 AM

ఎట్టకేలకు మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ దాసరితోట నుంచి మెట్టపాలెం పీవీటీజీ గ్రామానికి రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

ఎట్టకేలకు మెట్టపాలెం రోడ్డుకు మోక్షం
రోడ్డు పనులు ప్రారంభమైన దృశ్యం

పనులు ప్రారంభంకావడంతో గిరిజనుల హర్షం

అనంతగిరి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ దాసరితోట నుంచి మెట్టపాలెం పీవీటీజీ గ్రామానికి రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2024-25 సంవత్సరంలో 4 కిలోమీటర్ల రోడ్డు పనులకు రూ.3.73 కోట్ల పీఎం జన్‌మన్‌ నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ గత ఏడాది డుంబ్రిగుడ పర్యటనకు వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు. అయితే ఈ రోడ్డు మార్గంలోని జీలుగులపాడు సమీపంలో గోస్తనీ నదిపై వంతెన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఈ రహదారి పనులు చేపట్టలేదు. కాగా నాలుగు నెలల క్రితం గోస్తనీ నదిపై వంతెన నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చింది. అయినా దాసరితోట-మెట్టపాలెం రోడ్డు పనులు ప్రారంభంకాకపోవడం గిరిజనులు నెల రోజులుగా వివిధ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించి ఆదివారం ఉదయం రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణం చేపట్టి, వర్షాకాలానికి ముందుగానే రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 31 , 2026 | 12:33 AM