Share News

ఎట్టకేలకు గేటువలస- కోనాపురం రోడ్డుకు మోక్షం

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:33 PM

ఎట్టకేలకు గేటువలస- కోనాపురం రహదారికి మోక్షం కలిగింది. మండలంలోని బొర్రా గేటువలస నుంచి కోనాపురం వరకు రహదారి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. దీంతో 20 గ్రామాల ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి.

ఎట్టకేలకు గేటువలస- కోనాపురం రోడ్డుకు మోక్షం
అధ్వానంగా ఉన్న గేటువలస- కోనాపురం రోడ్డు

రహదారి పునర్నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు

తీరనున్న 20 గ్రామాల ప్రజల కష్టాలు

అనంతగిరి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు గేటువలస- కోనాపురం రహదారికి మోక్షం కలిగింది. మండలంలోని బొర్రా గేటువలస నుంచి కోనాపురం వరకు రహదారి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. దీంతో 20 గ్రామాల ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి.

అనంతగిరి, అరకులోయ మండలాల సరిహద్దు గ్రామాలను కలుపుతూ 15 ఏళ్ల క్రితం బొర్రా నుంచి కోనాపురం మీదుగా లోతేరు, ఇరగాయి వరకు రహదారి నిర్మించారు. దీంతో సుమారు 20 గ్రామాల ప్రజల రాకపోకలకు అనువుగా ఉండేది. అయితే ఆ తరువాత నిర్వహణ లేకపోవడం, భారీ వర్షాల కారణంగా దారి పొడవునా గోతులు ఏర్పడ్డాయి. సుమారు ఎనిమిదేళ్లుగా ఈ మార్గంలో రాకపోకలు సాగించడం దుర్లభంగా మారింది. ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.

5.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రహదారికి మోక్షం లభించింది. బొర్రా గేటువలస నుంచి కోనాపురం వరకు 5.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. రోడ్డు పనులకు సంబంధించి రెండు రోజుల క్రితం పరిపాలన ఆమోదం తెలిపింది. కాగా టెండర్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని పీఆర్‌ ప్రాజెక్ట్స్‌ ఏఈ గణేశ్‌ తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి 20 గ్రామాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని కోనాపురం సర్పంచ్‌ గుబాయి అప్పలమ్మ అన్నారు. రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించడం ఆనందంగా ఉందని, అయితే నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని అధికారులు చర్యలు తీసుకోవాలని అనంతగిరి ఎంపీపీ తడబారికి మితుల కోరారు.

Updated Date - Feb 05 , 2026 | 11:33 PM