ఎట్టకేలకు చోడవరం- వెంకన్నపాలెం రోడ్డుకు మోక్షం
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:53 AM
ఎట్టకేలకు చోడవరం- వెంకన్నపాలెం రహదారికి మోక్షం లభించింది. అధ్వానంగా ఉన్న ఈ రోడ్డులో ఏడేళ్లుగా ప్రత్యక్ష నరకం చూస్తున్న వాహనచోదకులకు ఊరట కలిగించే విధంగా రోడ్డు పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆగస్టు 15లోగా చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు ప్రధాన రహదారి పనులు పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ రంగయ్య స్థానిక అదనపు జిల్లా కోర్టు జడ్జికి ఇచ్చిన లిఖిత పూర్వక హామీ ఇవ్వగా, గడువు ముగిసిపోతున్న తరుణంలో ఈ రోడ్డు పనులు ప్రారంభించారు.
- రహదారి పనులు ప్రారంభం
- ఏడేళ్లుగా పడుతున్న కష్టాలు తీరనున్నాయని వాహనదారుల ఆనందం
చోడవరం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు చోడవరం- వెంకన్నపాలెం రహదారికి మోక్షం లభించింది. అధ్వానంగా ఉన్న ఈ రోడ్డులో ఏడేళ్లుగా ప్రత్యక్ష నరకం చూస్తున్న వాహనచోదకులకు ఊరట కలిగించే విధంగా రోడ్డు పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆగస్టు 15లోగా చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు ప్రధాన రహదారి పనులు పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ రంగయ్య స్థానిక అదనపు జిల్లా కోర్టు జడ్జికి ఇచ్చిన లిఖిత పూర్వక హామీ ఇవ్వగా, గడువు ముగిసిపోతున్న తరుణంలో ఈ రోడ్డు పనులు ప్రారంభించారు. బీఎన్ రోడ్డు దుస్థితిపై స్థానిక న్యాయవాదులు కాండ్రేగుల డేవిడ్, తదితరులు ఏడాదిన్నర క్రితం కోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు విచారణకు హాజరైన ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులు పనులు పూర్తి చేస్తామంటూ హామీలతో నెలల తరబడి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెలాఖరున కోర్టు విచారణకు హాజరైన ఆర్‌అండ్‌బీ ఈఈ రంగయ్య ఆగస్టు 15లోగా చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు తొలుత పనులు పూర్తి చేస్తామని అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ మేరకు వెంకన్నపాలెం నుంచి అంభేరుపురం వరకు సుమారు అరకిలో మీటరు మేర తారురోడ్డు పూర్తి చేశారు. ఇంకా అంభేరుపురం నుంచి గోవాడ మీదుగా చోడవరం వరకు రోడ్డు పనులు పూర్తికావలసి ఉంది. ఆలస్యంగానైనా పనులు ప్రారంభంకావడంతో స్థానికులతో పాటు వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.