చివరిదశకు గృహ గణన
ABN , Publish Date - May 27 , 2026 | 12:12 AM
జనగణన-2027లో భాగంగా జిల్లాలో చేపట్టిన గృహ గణన సర్వే చివరి దశకు చేరింది. ఈనెల 30వ తేదీలోగా సర్వే పూర్తి చేయాల్సి ఉండడంతో క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను మరింత వేగంతం చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్‌ఓ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో గృహగణన సర్వేను ఆర్డీఓలు, తహశీల్దార్లు, జీవీఎంసీ జోనల్ కమిషనర్, మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు.
88.88 శాతం ఇళ్లల్లో సర్వే పూర్తి
మొత్తం 5,72,356 గృహాలు
ఇంతవరకు సర్వే చేసిన గృహాలు 5,08,587
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జనగణన-2027లో భాగంగా జిల్లాలో చేపట్టిన గృహ గణన సర్వే చివరి దశకు చేరింది. ఈనెల 30వ తేదీలోగా సర్వే పూర్తి చేయాల్సి ఉండడంతో క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను మరింత వేగంతం చేశారు. కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్‌ఓ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో గృహగణన సర్వేను ఆర్డీఓలు, తహశీల్దార్లు, జీవీఎంసీ జోనల్ కమిషనర్, మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,576 మంది ఉద్యోగులు సర్వేలో పాల్గొంటున్నారు. 436 మంది ఉద్యోగులు సూపర్‌వైజర్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్క ఎన్యూమరేటర్‌కు 200 గృహాలు కేటాయించారు. కాగా వారం రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ గడువులోగా సర్వేను పూర్తిచేయడానికి అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారు. రోజూ ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి గృహ గణన వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఒక సంఖ్యను కేటాయించి, గోడపై రాస్తున్నారు. వేసవి సెలవులు కావడం, కొంతమంది ఉపాధి పనుల కోసం తాత్కాలికంగా వలస వెళ్లడంతో మొత్తం మీద ఐదు శాతం ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయని, అటువంటి ఇళ్లకు రెండు లేదా మూడు పర్యాయాలు వెళ్లి కుటుంబ సభ్యులు అందుబాటులో వుంటే వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 5,72,356 గృహాలు ఉండగా మంగళవారం సాయంత్రానికి 5,08,587 (88.88 శాతం) గృహాల సర్వే పూర్తిచేశారు. ఈ నెల 30వ తేదీనాటికి నూరు శాతం గృహ గణనను పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.