Share News

గెడ్డలు పూడ్చి.. రోడ్లు వేసి..

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:44 AM

అనకాపల్లి పరిసరాల్లో నీటిపారుదల శాఖకు చెందిన వనరులను ధ్వంసం చేస్తూ దర్జాగా రోడ్లు నిర్మిస్తున్నారు.

గెడ్డలు పూడ్చి.. రోడ్లు వేసి..

మైనింగ్‌ వ్యాపారులకు అనుకూలంగా అధికారుల తీరు

డీఎంఎఫ్‌ నిధులు రూ.25 కోట్లతో మూడు రహదారుల నిర్మాణం

రేబాకలో గెడ్డలు, పాత్రుని చెరువు పూడ్చవేత

ఇదేమిటని అడిగిన రైతులకు బెదిరింపులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి పరిసరాల్లో నీటిపారుదల శాఖకు చెందిన వనరులను ధ్వంసం చేస్తూ దర్జాగా రోడ్లు నిర్మిస్తున్నారు. క్వారీల నుంచి బండరాళ్లు, మెటల్‌, కంకర వంటి వాటిని తరలించే లారీల రాకపోకల కోసం గెడ్డలు, వాగులు, సాగునీటి చెరువులను పూడ్చి వేయడం వివాదాస్పదం అవుతున్నది. వందల ఎకరాల కు నీరందించే సహజ వనరులను కనుమరుగు చేస్తూ రోడ్లు వేయడం రైతులనున తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా పనులు చేడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

డీఎంఎఫ్‌ సొమ్ముతో రోడ్ల నిర్మాణం

జిల్లా మినరల్‌ ఫండ్స్‌ రూ.25 కోట్లతో అనకాపల్లి మండలంలో మైనింగ్‌ క్వారీల కోసం రోడ్లు వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మైనింగ్‌ జరిగే గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఖర్చు చేయాల్సి డీఎంఎఫ్‌ నిధులను.. మైనింగ్‌ వ్యాపారుల అవసరాల కోసం రహదారుల నిర్మాణానికి ఖర్చు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామిడిపాలెం- మాకవరం రోడ్డుకు రూ.10 కోట్లు, గుంకల్లోవ- మాకవరం రోడ్డుకు రూ.9.5 కోట్లు, మార్టూరు- చింతనిప్పుల అగ్రహారం జంక్షన్‌ రోడ్డుకు రూ.4.5 కోట్లు మంజూరు చేశారు. ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా అనకాపల్లి మండలం రేబాక గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 224/4, 233/1, 243లో ఉన్న గెడ్డలు, పాత్రుని చెరువులో కొంత భాగాన్ని పూడ్చివేసి అర కిలోమీటరు పొడవున రోడ్డు వేస్తున్నారు. చెరువును కప్పేసి రోడ్డు వేయడం వల్ల వర్షాకాలంలో చెరువులోకి నీరు చేరక, ఆయకట్టుకు నీరు అందదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదేమిటని అడిగితే బెదిరింపులు

సాగునీటి వనరులను ధ్వంసం చేస్తూ రహదారులు నిర్మించడాన్ని ప్రశ్నిస్తున్న తమపై పోలీసు కేసులు పెట్టిస్తామని కొందరు నేతలు బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేసిన వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో పలువురు తమ ఫిర్యాదులను వెనక్కు తీసుకున్నారు. జిల్లా మినరల్‌ నిధులు ప్రజాప్రయోజనాల కోసం కాకుండా మైనింగ్‌ నిర్వహించే వ్యాపారుల స్వలాభం కోసం వినియోగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రేబాకలో పాత్రుని చెరువు, అనుబంధ పంట కాలువలు పూడ్చివేసి, రోడ్డు నిర్మించడంపై మరోసారి కలెక్టర్‌కు, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు రైతులు చెబుతున్నారు.

రెవెన్యూ మార్కింగ్‌ ప్రకారమే రోడ్డు పనులు

వేణుగోపాల్‌, డీఈఈ, జలవనరుల శాఖ

రెవెన్యూ అధికారులు ఇచ్చిన మార్కింగ్‌ ప్రకారమే చింతనిప్పుల అగ్రహారంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మిస్తున్న భూమి జలవనరుల శాఖదా? ఇతరులదా అన్నది మాకు తెలియదు. గ్రామస్థులు ఆరోపిస్తున్నట్టు పాత్రుని చెరువు, గెడ్డల పైనుంచి రోడ్డు వేయడం లేదు. అనకాపల్లి పట్టణంలో నుంచి మైనింగ్‌ లారీలు రాకపోకలు సాగించకుండా ఉండేందుకే మినరల్‌ ఫండ్స్‌తో రోడ్డు పనులు చేపడుతున్నారు.

Updated Date - Aug 04 , 2026 | 01:44 AM