Share News

వీఎంఆర్‌డీఏలో కదలని ఫైళ్లు

ABN , Publish Date - Mar 21 , 2026 | 01:12 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లోని కొన్ని విభాగాల్లో ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయి.

వీఎంఆర్‌డీఏలో కదలని ఫైళ్లు

ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు నెలల తరబడి సమయం

కమిషనర్‌ సమీక్ష

ఇకపై ఫైళ్లను జాయింట్‌ కమిషనర్‌ పరిశీలనకు పంపాలని ఆదేశం

విశాఖపట్నం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లోని కొన్ని విభాగాల్లో ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. సంస్థకు ఆదాయం తెచ్చి పెట్టే ప్లాట్ల (ఇళ్ల స్థలాల) రిజిస్ట్రేషన్ల వ్యవహారంలోనే ఇలా జరగడం గమనార్హం. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జాప్యం జరుగుతున్నదని ఉన్నతాధికారి ఇప్పటివరకూ భావించారు. సిరిపురం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలోనే ‘ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్‌ డెస్క్‌’ ఏర్పాటు చేయాలని భావించారు. దీనికోసం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖతోను చర్చలు జరిపారు. ఈలోపు లక్షలాది రూపాయలు చెల్లించినా నెలల తరబడి తమకు ప్లాట్లను రిజిస్టర్‌ చేయడం లేదంటూ ఫిర్యాదు చేసేవారి సంఖ్య వారం వారం పెరిగిపోతోంది. దిగువ స్థాయి సిబ్బంది అదనపు మొత్తాల కోసం ఏమైనా ఇబ్బంది పెడుతున్నారేమోనని ఇన్నాళ్లూ భావించారు. ఇటీవల సమీక్షలో గట్టిగా గదమాయించి అడిగేసరికి వారు అసలు విషయం చెప్పేశారు. తమ జాప్యం ఏమీ లేదని, ఫైళ్లు ఎప్పటికప్పు తమ పైఅధికారికి అప్‌లోడ్‌ చేస్తున్నామని, ఆయనే వాటిని చూడడం లేదని, అక్కడ పెండింగ్‌లో ఉండిపోతున్నాయని వెల్లడించారు. దీంతో కమిషనర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్లాట్లు, వాటికి సంబంధించిన ఫైళ్లను జాయింట్‌ కమిషనర్‌ పరిశీలనకు పంపాలని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం వీఎంఆర్‌డీఏలో పలువురికి జీర్ణం కావడం లేదు. సంస్థ పెట్టినప్పటి నుంచి స్థలాలు, వాటి రిజిస్ట్రేషన్ల వ్యవహారం సెక్రటరీ పేషీనే చూస్తోందని, ఇప్పుడు ఆ అధికారం వేరే అధికారికి ఇవ్వడం ఏమిటని గుసగుసలాడుతున్నారు. అయితే ఇదే పేషీలో బిల్లులు కూడా జాప్యం అవుతున్నాయని గుర్తించి, కొన్ని నెలల క్రితం చెక్‌ పవర్‌ను కూడా తీసేశారు. ఆ విషయం కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది. ఏ ఫైల్‌ వెళ్లినా ఆ పేషీలో క్లియర్‌ కావడం లేదని, అందుకే తప్పనిసరి స్థితిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిసింది. అయితే ఫైళ్ల క్లియరెన్స్‌లో తీవ్ర జాప్యం చేస్తున్న ఆ అధికారికి మరో ఏడాది డిప్యుటేషన్‌ ఎలా ఇచ్చారని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 01:12 AM