Share News

జడ్పీ వసతిపై జగడం

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:20 PM

జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లా పరిషత్‌ కార్యాలయానికి వసతి కొత్త సమస్య ఏర్పడింది.

జడ్పీ వసతిపై జగడం
జడ్పీ కార్యాలయాలన్ని ఎంపిక చేసిన కాఫీ హౌస్‌ భవనం

కాఫీహౌస్‌లో జడ్పీ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం

దానిని అప్పగించేందుకు ముందుకు రాని ఐటీడీఏ

తర్జనభర్జన పడుతున్న జిల్లా పరిషత్‌ అధికారులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లా పరిషత్‌ కార్యాలయానికి వసతి కొత్త సమస్య ఏర్పడింది. ఈనెల 24వ తేదీతో ఉమ్మడి జిల్లా పరిషత్‌ పాలకవర్గ ఐదేళ్ల కాలం ముగియడంతో ఇకపై అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో సైతం కొత్తగా జిల్లా పరిషత్‌ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో పాడేరులో జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని స్థానిక కాఫీహౌస్‌లో ఏర్పాటు చేయాలని జిల్లాపరిషత్‌ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు దానిని జడ్పీ కార్యాలయానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే దానిని జడ్పీ కార్యాయానికి వినియోగించుకోవచ్చునని జిల్లా కలెక్టర్‌ మౌఖిక ఆదేశాలు మాత్రమే జారీ చేశారని తెలిసింది. అయితే కాఫీహౌస్‌ భవనం ఐటీడీఏ ఆధీనంలో ఉండడంతో దానిని అధికారికంగా ఐటీడీఏ అధికారులు అప్పగించాల్సి ఉంది.

కాఫీ హౌస్‌ను అప్పగించేందుకు ఐటీడీఏ విముఖత

తమ ఆధీనంలో ఉన్న కాఫీ హౌస్‌ను జిల్లా పరిషత్‌కు అప్పగించేందుకు ఐటీడీఏ అధికారులు విముఖతగా ఉన్నారని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల నుంచి వచ్చే అతిథులకు వసతి కల్పించేందుకు ఉన్న ఏకైక భవనాన్ని జడ్పీకి అప్పగిస్తే, వసతి, ఇతర భవిష్యత్తు అవసరాలకు ఇబ్బందులు ఏర్పడతాయని భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జిల్లాపరిషత్‌కు సంబంధించిన భవనాలు లేదా ఇతర శాఖలకు చెందిన భవనాల్లో జడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఐటీడీఏ అధికారులు సూచిస్తున్నారు. ఈమేరకు కలెక్టరేట్‌కు సైతం ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ లిఖిత పూర్వకంగా తెలియజేశారు. దీంతో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాపరిషత్‌ కార్యాలయానికి ఎక్కడ వసతిని సమకూర్చాలనే దానిపై సంబంధిత అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ పరిణామం ఐటీడీఏ, జిల్లా పరిషత్‌ అధికారుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతున్నది.

Updated Date - Sep 12 , 2026 | 11:20 PM