కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:25 AM
జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో వరి సాగు బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో జిల్లాలో మాడుగుల, రాంబిల్లి మినహా మిగతా 22 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖాధికారులు జిల్లాలోని కరువు మండలాల పరిస్థితులపై అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు ఆయా మండలాల్లో వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
- జిల్లాలోని 22 మండలాల్లో అంచనాల రూపకల్పన
- 6 వరకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక
- ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన
- వ్యవసాయాధికారుల విస్తృత పర్యటన
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌లో వరి సాగు బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో జిల్లాలో మాడుగుల, రాంబిల్లి మినహా మిగతా 22 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖాధికారులు జిల్లాలోని కరువు మండలాల పరిస్థితులపై అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు ఆయా మండలాల్లో వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 22 కరువు మండలాల్లో పంటల సాగు, వర్షపాతం, పంటల పరిస్థితిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మాడుగుల, రాంబిల్లి మినహా మిగిలిన చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, అనకాపల్లి, కశింకోట, పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల, నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, సబ్బవరం, పరవాడ, ఎలమంచిలి, మునగపాక, అచ్యుతాపురం మండలాలను కరువు జాబితాలో చేర్చిన నేపథ్యంలో జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మూడు నెలల వ్యవధిలో నమోదైన వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, వ్యవసాయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కరువు తీవ్రతను అంచనా వేయనున్నారు. వ్యవసాయాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో శనివారం నుంచి పంటల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల ప్రభావం, పంటల సాగులో వచ్చిన మార్పులు, వ్యవసాయ కార్యకలాపాల పురోగతిపై సమాచారాన్ని సేకరించి నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన సూచికల ఆధారంగా మండలాల వారీగా వివరాలను విశ్లేషించి, జిల్లా స్థాయిలో సమగ్ర నివేదికను రూపొందించనున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి ఆశాదేవి తెలిపారు. ఈ వివరాల ఆధారంగా కరువు పరిస్థితులను అంచనా వేయడంతో పాటు తదుపరి వ్యవసాయ చర్యలకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించనున్నట్టు పేర్కొన్నారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించడంపై వ్యవసాయశాఖ దృష్టి సారించిందని తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం
జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వరి సాగు జరగలేదు. జిల్లాలో 56,329 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా, సెప్టెంబరు నెలాఖరు నాటికి కేవలం 19,370 హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. దీంతో జిల్లా వ్యవసాయాధికారులు గత వారం కురిసిన వర్షాలతో నీరు చేరిన ప్రాంతాల్లో వరి నాట్లు పడేలా సూచనలు చేస్తున్నారు. అంతే కాకుండా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రోత్సహిస్తున్నారు. వరి స్థానంలో తక్కువ నీటితో స్వల్ప వ్యవధిలో చేతికి వచ్చే అపరాల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఉలవలు, మినుములు, పెసర్లతో పాటు చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు, కొర్రలు వేయడంపై రైతులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా ఇప్పటికే 200 క్వింటాళ్ల జనుము, 100 క్వింటాళ్ల ఉలవలు, 40 క్వింటాళ్ల రాగులు.. మొత్తం 340 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేసి, పంపిణీకి ఏర్పాట్లు చేశారు. వరి సాగు నిలిచిపోయిన పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేటప్పుడు రైతులు పాటించాల్సిన సాంకేతిక యాజమాన్య పద్ధతులపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.