Share News

కూలీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:36 AM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళుతున్న కూలీల నుంచి కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీవోలతోపాటు, కార్యాలయం సిబ్బందికి ఖర్చుల కోసం ఒక్కో కూలీ వారానికి వంద రూపాయల చొప్పున ఇవ్వాలని, లేకపోతే మస్తరు (హాజరు) నమోదు చేసేది లేదని క్షేత్రస్థాయిలో సిబ్బంది బెదిరిస్తున్నారు. మామూళ్లు ఇవ్వని పక్షంలో వారికి కూలి డబ్బులు తక్కువ వచ్చేలా చేయడం, పనులు కల్పించకపోవడం వంటి చర్యలతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ తరహా అక్రమ వసూళ్లపై పలువురు కూలీలు పని ప్రదేశంలో సిబ్బందిని నిలదీస్తుండగా, మరికొందరు మండల, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

కూలీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న క్షేత్రస్థాయి ఉద్యోగులు
చెరువులో పూడికతీత పనులు చేస్తున్న ఉపాధి హామీ పథకం కూలీలు ‘ఉపాధి’ సిబ్బంది దందా

ఒక్కొక్కరు వారానికి రూ.100 చొప్పున ఇవ్వాలని హుకుం

డబ్బులు ఇవ్వని కూలీలకు వేధింపులు

పని దినాలు, వేతనాల్లో కోత

సిబ్బందిని నిలదీస్తున్న కూలీలు

చోడవరం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళుతున్న కూలీల నుంచి కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీవోలతోపాటు, కార్యాలయం సిబ్బందికి ఖర్చుల కోసం ఒక్కో కూలీ వారానికి వంద రూపాయల చొప్పున ఇవ్వాలని, లేకపోతే మస్తరు (హాజరు) నమోదు చేసేది లేదని క్షేత్రస్థాయిలో సిబ్బంది బెదిరిస్తున్నారు. మామూళ్లు ఇవ్వని పక్షంలో వారికి కూలి డబ్బులు తక్కువ వచ్చేలా చేయడం, పనులు కల్పించకపోవడం వంటి చర్యలతో గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ తరహా అక్రమ వసూళ్లపై పలువురు కూలీలు పని ప్రదేశంలో సిబ్బందిని నిలదీస్తుండగా, మరికొందరు మండల, జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

చోడవరం మండలం లక్కవరం పంచాయతీ పరిధిలో ఉపాధి పనులకు హాజరవుతున్న కూలీల నుంచి రోజుకు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో సుమారు 500 మంది ఉపాధి కూలీలు వున్నారు. మండలస్థాయి అధికారులకు ఇవ్వాలంటూ రోజుకు రూ.20 చొప్పున సుమారు రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమ వసూళ్లపై కొంతమంది గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు గ్రామానికి వచ్చి.. ఉపాధి సిబ్బందికి డబ్బులు ఇవ్వొద్దని కూలీలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే అధికారులు గ్రామానికి వచ్చి వెళ్లిన మరుసటి రోజు నుంచి ఉపాధి పనుల వేతనాలు సగమే వస్తుండడంతో కూలీలు లబోదిబోమంటున్నారు.

రోలుగుంట మండలం కొమరవోలులో ఫీల్డు అసిస్టెంట్‌, మేట్లు కలిసి, ఉపాధి కూలీల వేతనాల నుంచి వారానికి రూ.100 చొప్పున ఏడు వారాలకు సంబంధించి ఒక్కొక్కరి నుంచి రూ.700 వరకూ వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. బలవంతపు వసూళ్లపై కూలీలు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు.

గత నెలలో బుచ్చెయ్యపేట పంచాయతీలో కూడా మస్తర్ల వ్యవహారంలో వీఆర్‌ పీ తీరుపై అందిన ఫిర్యాదులపై అధికారులు చేపట్టిన విచారణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తాజాగా చీడికాడ మండలం జేపీ పురంలో ఉపాధి కూలీల నుంచి వసూలు చేసిన డబ్బులను ఏపీవోలకు ఇవ్వకపోవడంతో తమకు లాగిన్‌ తొలగించారంటూ ఆ గ్రామానికి చెందిన ఉపాధి మేట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలోని పలు పంచాయతీల్లో ఇదే తరహాలు ఉపాధి కూలీల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణులు వినిపిస్తున్నాయి.

మామూళ్లు ఇస్తే ఓకే...

మేట్లు అడిగిన డబ్బులు ఇవ్వని కూలీలకు మరుసటి వారం నుంచి పనిలేకపోవడమో, లేదంటే వారు చేసిన పనికి వచ్చే కూలి డబ్బులు తగ్గిపోవడమో జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోడవరం మండలం లక్కవరంలో రెండు వారాల క్రితం రోజుకు సగటున రూ.250 వరకు కూలి డబ్బులు వచ్చేవని, అక్రమ వసూళ్లపై కూలీలు, అధికారులకు ఫిర్యాదు చేసిన తరువాత రూ.150కి మించి రావడం లేదని కూలీలు వాపోతున్నారు. తమ నుంచి వసూలు చేసిన డబ్బులను క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు గ్రామ, మండలస్థాయి అధికారుల వరకు పంచుకుంటారని కూలీలు ఆరోపిస్తున్నారు. డ్వామా ఉన్నతాధికారులు స్పందించి, ఉపాధి కూలీల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jun 10 , 2026 | 12:36 AM