రైతులు తక్కువ, దళారులు ఎక్కువ
ABN , Publish Date - May 21 , 2026 | 12:54 AM
నగరంలోని రైతుబజార్లలో అన్నిరకాల కూరగాయలు అందుబాటులో ఉండడం లేదు. ఉన్న వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. ప్రస్తుతం ప్రతి స్టాల్‌లో మామిడి పండ్లే విక్రయిస్తున్నారు. కొన్ని స్టాళ్లలో రైతులకు బదులు అనర్హులు దర్శనమిస్తున్నారు. రాష్ట్రంలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్న జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉందంటే క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో ఆకస్మిక తనిఖీల ద్వారా తెలుసుకోవసిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై పడింది.
ఇదీ నగరంలోని రైతుబజార్ల పరిస్థితి
రైతుల స్థానంలో అనర్హుల ప్రవేశం
వారంతా మార్కెట్‌లో తెచ్చి విక్రయాలు జరుపుతున్న వైనం
రూ.లక్షలు చేతులు మారుతున్నట్టు ప్రచారం
అందుబాటులోని లేని అన్నిరకాల కూరగాయలు
ప్రస్తుతం ప్రతి స్టాల్‌లో మామిడిపండ్ల అమ్మకాలు
పట్టని జిల్లా అధికారులు
(విశాఖపట్నం/సీతమ్మధార/ఎంవీపీ కాలనీ/మధురవాడ/ఆరిలోవ/కంచరపాలెం/అక్కయ్యపాలెం-ఆంధ్రజ్యోతి)
నగరంలోని రైతుబజార్లలో అన్నిరకాల కూరగాయలు అందుబాటులో ఉండడం లేదు. ఉన్న వాటి ధరలు కూడా మండిపోతున్నాయి. ప్రస్తుతం ప్రతి స్టాల్‌లో మామిడి పండ్లే విక్రయిస్తున్నారు. కొన్ని స్టాళ్లలో రైతులకు బదులు అనర్హులు దర్శనమిస్తున్నారు. రాష్ట్రంలో డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్న జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉందంటే క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతున్నదో ఆకస్మిక తనిఖీల ద్వారా తెలుసుకోవసిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులపై పడింది.
నగరంలో 15 రైతుబజార్లు ఉన్నాయి. ఒక్కో బజార్‌లో 200 మందికి తక్కువ లేకుండా రైతులు ఉన్నారు. ఇటీవల కూరగాయల ధరలు బాగా పెరిగాయి. అయినా అన్ని రకాలు దొరకడం లేదు. గత రెండు నెలల్లో ధరల మార్పు గమనిస్తే టమాటా కిలో పది రూపాయల నుంచి 36 రూపాయలకు చేరింది. బీన్స్ రూ.40 నుంచి రూ.150కి పెరిగింది. అల్లం రూ.65 నుంచి రూ.120కి ఎగబాకింది. వంకాయలు రూ.22 నుంచి రూ.40కి, చిక్కుడు రూ.30 నుంచి రూ.54కి చేరాయి. ఈ ధరల నియంత్రణకు మార్కెటింగ్ శాఖాధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది. హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లి, అవసరమైన సరకులు తెప్పించేలా సమన్వయం చేయాల్సి ఉంది. కానీ ఆ పని సక్రమంగా జరగడం లేదు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లే రైతుబజార్ల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. విశాఖలో కూడా గతంలో అసిస్టెంట్ డైరెక్టరే చూసేవారు. కానీ రెండేళ్ల నుంచి ఒక్క విశాఖలోనే ఆరు జిల్లాల బాధ్యతలు చూడాల్సిన డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి రైతుబజార్లను పర్యవేక్షిస్తున్నారు. అయినా ఇక్కడ పరిస్థితి బాగా లేదు. ప్రస్తుతం రైతుబజార్లలో కూరగాయల కంటే మామిడిపండ్ల విక్రయాలే ఎక్కువగా జరుగుతున్నాయి. సీజన్ కాబట్టి తప్పులేదు అనుకున్నా కూరగాయలు లేకపోవడంపైనే విమర్శలు వస్తున్నాయి.
పెరిగిపోతున్న అనర్హులు
రైతుబజార్లలో పంటలు పండించే రైతులే కూరగాయలు విక్రయించాలి. రైతులను గతంలో ఉద్యానవన శాఖాధికారులు గుర్తించి కార్డులు ఇచ్చేవారు. ఇటీవల ఈ బాధ్యత వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులు తీసుకున్నారు. అప్పటి నుంచి అనర్హులు పెరిగిపోయారు. పంట పండించే రైతు గ్రామంలో ఉంటే వారి తరపున కుటుంబ సభ్యులు ఎవరైనా రైతుబజార్‌లో కూరలు అమ్ముకోవడానికి నామినీ సౌకర్యం కల్పించారు. అదే అధికారులకు కలిసి వచ్చింది. ఆ కుటుంబంలో భార్య/భర్త, కుమారుడు/కుమార్తెకు నామినీ కార్డు ఇవ్వాలి. కానీ కుటుంబంలో సభ్యులు కాకపోయినా, ఏదో బీరకాయ పీచు సంబంధం చూపించి అనర్హులకు నామినీలుగా కార్డులు ఇస్తున్నారు. దీనికి లక్ష రూపాయల వరకు లంచం తీసుకుంటున్నారు. అలా లంచాలు ఇచ్చి బజార్లకు వస్తున్నవారు హోల్‌సేల్ మార్కెట్‌లో ఏవి దొరికితే అవి తెచ్చి బజార్లలో అమ్ముకొని లాభపడుతున్నారు.
వ్యవసాయ మార్కెటింగ్ శాఖాధికారులు ప్రతి బజార్‌లో కొందరు అనర్హులను ఏజెంట్లుగా పెట్టుకొని, కార్డులు ఉన్నా బజార్లకు రాని రైతులు ఎవరో గమనించి సమాచారం తీసుకుంటున్నారు. రెండు, మూడు నెలలు చూసి, వారి పేర్లు తొలగించి నచ్చిన వారికి కొత్త కార్డులు ఇస్తున్నారు. దీనికి కూడా రూ.లక్షల్లోనే వసూలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నింటికీ జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) ఆమోదం తెలపాలి. కొత్త కార్డులు, స్టాళ్ల మంజూరు ఫైళ్లను జేసీ వద్దకు తీసుకువెళ్లినప్పుడు...ఎమ్మెల్యేలు సిఫారసు చేశారని, ముందుగా తెప్పించుకున్న లేఖలను అధికారులు చూపిస్తున్నారు. దాంతో అక్కడ ఆమోదానికి పెద్దగా ఇబ్బందులు రావడం లేదు. జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా ఫలానా వారికి స్టాల్ ఇవ్వాలని సిఫారసు చేస్తున్నారు. ఆ లేఖలు వచ్చిన వారితోనే అధికారులు బేరసారాలు సాగించి, దారికి వచ్చాక ప్రాసెస్ చేస్తున్నారు. ఇవన్నీ ఎవరికీ అనుమానం రాకుండా చేస్తున్నారు. అటు ఎమ్మెల్యేల వద్ద మంచి మార్కులు కొట్టేస్తున్నారు. గత రెండేళ్లలో సుమారు 200 మంది అనర్హులకు నామినీల పేరుతో కార్డులు ఇచ్చారు. వాటిపై విచారణ చేస్తే బండారం బయటపడుతుంది. కార్డుల జారీలో ఎవరు కీలకంగా వ్యవహరిస్తున్నారో తేలిపోతుంది.