అరకొర నిర్మాణాలు.. చిన్నారుల అవస్థలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:06 PM
మండలంలోని పాఠశాలల్లో అరకొర సౌకర్యాల నడుమ చిన్నారులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అసంపూర్తి భవనాలు, కారిపోతున్న రేకుల షెడ్లు, శిథిల భవనాల్లో చదువులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీరు, ఫర్నీచర్, మరుగుదొడ్లు తదితర మౌలిక సౌకర్యాలు కూడా పాఠశాలల్లో ఉండడం లేదు. అరకొర నిర్మాణాలతో ఉన్న భవనాలను పూర్తిచేయించడంలో విద్యా శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు విఫలమయ్యారు. కొన్ని ప్రాథమిక పాఠశాలల దుస్థితిపై అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
ఏళ్లు గడుస్తున్న పూర్తి చేయని నిర్మాణాలు
అసౌకర్యాల నడుమ చిన్నారుల చదువులు
పట్టించుకోని అధికారులపై తల్లిదండ్రుల మండిపాటు
అరకులోయ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): అరకులోయ మండలంలో విద్యా శాఖా లెక్కల ప్రకారం 150 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో పది పాఠశాలలకు అసలు భవనాలే లేవు. మిగిలిన వాటిలో 50 పాఠశాలలకు పైగా భవనాలు మరమ్మతులకు గురయ్యాయి. అలాగే 1998వ సంవత్సరంలో డిపెప్ పథకం కింద నిర్మించిన పాఠశాల భవనాలన్నీ పాడైపోయి మరమ్మతులకు గురయ్యాయి.
-అరకులోయ-లోతేరు రోడ్డులో ఉన్న తడక పాఠశాలకు ఎనిమిదేళ్ల క్రితం శ్లాబ్, ప్లాస్టింగ్ చేశారు. ఫ్లోరింగ్ చేయకుండా వదిలేశారు. దీంతో అక్కడ ఉన్న పాత రేకుల షెడ్‌లోనే అన్ని తరగతులను నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో రేకులషెడ్ కారిపోతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. రన్నింగ్ వాటర్ లేక టాయ్‌లెట్స్ ఉపయోగపడడం లేదు. బోరు ఉన్నా పనిచేయడం లేదు. పాఠశాల చుట్టూ ప్రహరీ లేదు.
-లోతేరు-తోలవలసలో పాఠశాల భవనాన్ని అరకొరగా నిర్మించారు. గోడలు, ప్లాస్టింగ్‌లు, ఫ్లోరింగ్, విద్యుత్ వైరింగ్ చేయలేదు. పాఠశాల భవనంతోపాటు కిచెన్‌షెడ్, టాయ్‌లెట్స్, ప్రహరీ, రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించేందుకు నిధులు మంజూరైనా కాంట్రాక్టర్ ఏ పనులు చేయలేదు. అరకొరగా వదిలేసిన భవనంలో కొంత ప్రాంతాన్ని ఉపాధ్యాయుడు బాగు చేయించి తరగతులను నిర్వహిస్తున్నారు. అధికారుల తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-మజ్జివలస ప్రాథమిక పాఠశాల భవనానికి శ్లాబ్ వేసి మిగతా పనులు చేపట్టకుండా కాంట్రాక్టర్ వదిలివేశాడు. ఈ శ్లాబ్ సక్రమంగా వేయకపోవడంతో దానిని తొలగించి, నాడు-నేడులో మంజూరైన నిధులతో రేకులతో భవనాన్ని నిర్మించారు. అయితే నిధులు చాలకపోవడంతో ఫ్లోరింగ్ చేయలేదు. ప్రస్తుతం చిన్నారులు నేలపైనే కూర్చొని చదువుకుంటున్నారు. రన్నింగ్ వాటర్, టాయ్‌లెట్స్ లేవు.
ఇలా మండలంలో చాలా ప్రాథమిక పాఠశాలలకు పక్కా భవనాలు లేక పాత రేకుల షెడ్లలోనే తరగతులను నిర్వహిస్తున్నారు. 1998లో డిపెప్ పథకంలో నిర్మించిన పాఠశాల భవనాలన్నీ పాడయ్యాయి. వాటికి నిధులు మంజూరు చేస్తేనే చిన్నారులకు భవనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలను జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, డీఈవో కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యా కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.