జ్వరాల విజృంభణ
ABN , Publish Date - May 21 , 2026 | 11:53 PM
మండలంలోని గొందపాకలు పంచాయతీ యర్రవరం, యర్నాపల్లి గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పలువురు గిరిజనులకు మలేరియా నిర్ధారణ అయింది. ఆదివాసీలు ఇంటికి ఒకరు చొప్పున మంచానపడి వైద్యం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జాడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- యర్రవరం, ఎర్నాపల్లి గ్రామాల్లో పలువురిలో మలేరియా నిర్ధారణ
- జాడలేని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది
చింతపల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొందపాకలు పంచాయతీ యర్రవరం, యర్నాపల్లి గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పలువురు గిరిజనులకు మలేరియా నిర్ధారణ అయింది. ఆదివాసీలు ఇంటికి ఒకరు చొప్పున మంచానపడి వైద్యం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది జాడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇద్దరు ఏఎన్‌ఎంలు గ్రామాన్ని సందర్శించి వెళ్లిపోయారని, వైద్యసిబ్బంది వద్ద మలేరియా నివారణ మందులు లేవని బాధితులు చెబుతున్నారు. గిరిజన ప్రాంతంలో ఎపిడమిక్ సీజన్ ప్రారంభం కావడంతో పలు గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. గొందిపాకలు పంచాయతీ పరిధిలోని యర్రవరం, ఎర్నాపల్లి గ్రామాల్లో పది రోజుల క్రితం జ్వరాలు ప్రబలాయి. తమ గ్రామాల్లో ఆదివాసీలు వ్యాధులతో బాధపడుతున్నారని లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే ఏ ఒక్కరూ గ్రామాన్ని సందర్శించలేదు. నాలుగు రోజుల క్రితం ఇద్దరు ఏఎన్‌ఎంలు మొక్కుబడిగా గ్రామాన్ని సందర్శించి రక్త పరీక్షలు నిర్వహించారు. ఏఎన్‌ఎంలు నిర్వహించిన రక్త పరీక్షల్లో ఆరుగురికి మలేరియా పాజిటివ్ వచ్చినప్పటికి నివారణ మందులు పంపిణీ చేయలేదు. ఆస్పత్రిలో మలేరియా నివారణ మందులు లేవని, ప్రైవేటుగా కొనుగోలు చేసుకోవాలని సలహా ఇచ్చి వెళ్లిపోయారని, నాటి నుంచి నేటి వరకు మళ్లీ వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం యర్రవరం గ్రామంలో నాలుగేళ్ల బాలిక గుండేపు రస్మిత మలేరియాతో బాధపడుతోంది. అదే గ్రామానికి చెందిన జి.వెంకటరాజు, జి.రవణమ్మ, చిన్నరాజు, జి.వెంకటలక్ష్మి, జేశ్వంత్, బేరా సాయికిరణ్, చెదల బెన్నాస్వామి, కృష్ణరాజు, పొర్లుబందకు చెందిన కొర్ర కొండబాబు, లక్ష్మి, అలాగే ఎర్నాపల్లి గ్రామంలో వి.చిన్నారావుతో పాటు సుమారు 36 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వర బాధితులు తీవ్ర నిరసంతో నడవలేని స్థితిలో మంచానపడి వైద్యం కోసం ఎదురుచూస్తున్నారు. కొంత మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఇప్పటికైనా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.