Share News

జ్వరాల విజృంభణ

ABN , Publish Date - May 12 , 2026 | 12:35 AM

చింతపల్లి పరిధిలోని గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా పలు గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి.

జ్వరాల విజృంభణ
వార్డులో ఒకే మంచంపై చికిత్స పొందుతున్న ఇద్దరు జ్వర బాధితులు

ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి

పెరుగుతున్న మలేరియా, టైఫాయిడ్‌ కేసులు

ఎపిడమిక్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో గిరిజన గ్రామాల్లో వ్యాధులు

క్షేత్ర స్థాయిలో నామమాత్రంగా ప్రత్యేక వైద్య శిబిరాలు

చింతపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి పరిధిలోని గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా పలు గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి రోగుల తాకిడి భారీగా పెరిగింది. 20 రోజులుగా ఏరియా ఆస్పత్రికి రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వార్డులు జ్వర బాధితులతో నిండిపోయాయి. పడకలు సరిపడక ఒక మంచంపై ఇద్దరు రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

జిల్లాలో ప్రస్తుతం ఎపిడమిక్‌(వ్యాధులు) సీజన్‌ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో గిరిజన గ్రామాల్లో మలేరియా, వైరల్‌, టైఫాయిడ్‌, డెంగ్యూతో పాటు అతిసార వ్యాధులు ప్రబలడం సాధారణం. ప్రస్తుతం వేసవి అయినప్పటికీ ప్రతి రోజూ ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వర్షం కురుస్తోంది. దీంతో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గతంలో పోల్చుకుంటే మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి కిముడు దయాకర్‌ మలేరియాతో మృతి చెందాడు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో మార్చి నుంచి 3,768 మంది జ్వర బాధితులకు రక్త పరీక్షలు నిర్వహించగా, 34 మందికి మలేరియా పాజిటివ్‌ వచ్చింది. ఇద్దరు ఐదేళ్లలోపు చిన్నారులకు మలేరియా వచ్చింది. 3,067మందికి పరీక్షలు నిర్వహించగా, 53 మందికి టైఫాయిడ్‌ నిర్ధారణ అయింది. అయితే వైరల్‌ జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య అత్యధికంగా వుంది. ప్రస్తుతం ప్రతి రోజూ ఏరియా ఆస్పత్రికి 500 మందికి పైగా రోగులు చికిత్స కోసం వస్తున్నారు. వార్డుల్లో 50 నుంచి 60 మంది జ్వర బాధితులు ఇన్‌పేషెంట్లుగా ఉంటున్నారు. దీంతో పాటు అతిసార బాధితులు కూడా ఏరియా ఆస్పత్రికి వస్తున్నారు.

రెండు మండలాల ప్రజలకు ఆధారం

చింతపల్లి, జీకేవీధి మండలాలకు స్థానిక ఏరియా ఆస్పత్రి ఒక్కటే ఆధారం. రెండు మండలాల్లో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న రోగులతో పాటు జి.మాడుగుల, కొయ్యూరు మండలాల సరిహద్దు గ్రామాల గిరిజనులు చికిత్స కోసం చింతపల్లి ఏరియా ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచినప్పటికి తగినన్ని సదుపాయాలు అందుబాటులో లేవు. నూతన భవనాల నిర్మాణాలు పూర్తికాలేదు. దీంతో సుమారు 20 ఏళ్ల క్రితం ఆస్పత్రి అవసరాల కోసం నిర్మించిన భవనంలోనే సర్దుకుంటూ వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో కేవలం 50 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో రోగుల తాకిడి పెరిగిన సమయంలో ఒకే బెడ్‌లో ఇద్దరిని పడుకోబెట్టి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలోని వార్డులు రోగులతో నిండిపోయాయి.

కానరాని ప్రత్యేక వైద్య శిబిరాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గిరిజన గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఆస్పత్రి ఓపీలో ఉంటే మరో వైద్యాధికారి గ్రామాలను సందర్శించి ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసేవారు. నెలలో పీహెచ్‌సీ పరిధిలో 18 ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసేవారు. వారపు సంత జరిగే ప్రాంతంలోనూ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసేవారు. గత వైసీపీ ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకొచ్చి ప్రత్యేక వైద్యశిబిరాలను పక్కన పెట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వైద్య ఆరోగ్యశాఖలో మార్పురాలేదు. ఇప్పటికీ ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంలో భాగంగా వారానికి ఒకటీ, రెండు రోజులు పీహెచ్‌సీ వైద్యాధికారి ఒకటీ, రెండు గ్రామాలను సందర్శించి ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు. ఈ కారణంగా గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలిన వెంటనే రోగులకు చికిత్స అందడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యసిబ్బంది గ్రామాల్లో తరచూ ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి చికిత్స అందిస్తే కొంత వరకు ఏరియా ఆస్పత్రిపై రోగుల భారం తగ్గుతుంది. ఇప్పటికైనా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టర్‌ స్పందించి గిరిజన గ్రామాల్లో పీహెచ్‌సీ వైద్యులు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి రోగులకు సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ఆదివాసీలు కోరుతున్నారు.

Updated Date - May 12 , 2026 | 12:35 AM