Share News

రంగవల్లులతో పండుగ శోభ

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:37 PM

సంక్రాంతిని పురస్కరించుకుని ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అందాల అరకులోయలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి.

రంగవల్లులతో పండుగ శోభ
అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉత్సాహంగా ముగ్గులు వేస్తున్న మహిళలు, యువతులు

అరకులోయలో ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువతులు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం కళకళ

ముఖ్య అతిథిగా హాజరైన పాడేరు డీఎస్‌పీ ఆర్‌ఆర్‌వీఎస్‌ అభిషేక్‌

ప్రథమ విజేత పి.జగదీశ్వరి, ద్వితీయ స్థానం కె.మాధురి, తృతీయ స్థానం పి.లక్ష్మి

ఆరుగురికి ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు

అరకులోయ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతిని పురస్కరించుకుని ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అందాల అరకులోయలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. తెలుగింటి సంప్రదాయం, సంస్కృతి ప్రతిబింబించేలా వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచాయి. సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్‌ బై సన్‌ఫీస్ట్‌ మ్యాజిక్‌ మామ్స్‌ బిస్కెట్స్‌, టేస్ట్‌ పార్టనర్‌ స్వస్తిక్‌ మసాలా, ప్రేయర్‌ పార్టనర్‌ పరిమళ్‌ మందిర్‌ భారత్‌వాసి అగరబత్తీ సహకారంతో పట్టాసి ఫౌండేషన్‌ స్థానిక స్పాన్సర్‌గా నిర్వహించిన ఈ పోటీల్లో 51 మంది మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చలి తీవ్రతను సైతం లెక్క చేయకుండా ఉదయం పది గంటలకే పోటీల్లో పాల్గొనే మహిళలు కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే అప్పటికీ దట్టంగా మంచు కురుస్తుండడంతో ఉదయం పదకొండు గంటలకు ముగ్గుల పోటీలను ప్రారంభించారు. స్థానికులైన సరోజిని సాహు, స్వర్ణలత, నాగరత్నం జడ్జిలుగా వ్యవహరించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగ్గులు వేయడం పూర్తయిన వెంటనే పాల్గొన్న వారందరికీ పట్టాసి ఫౌండేషన్‌ ప్రతినిధులు స్నాక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌ అందించారు.

విజేతలకు బహుమతులు

ముగ్గుల పోటీల్లో 51 మంది పాల్గొనగా, వారిలో ప్రతిభ చూపిన ముగ్గురు మహిళలకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించారు. వీరిలో ప్రథమ స్థానం సాధించిన పాడేరుకు చెందిన పి.జగదీశ్వరికి పాడేరు డీఎస్‌పీ ఆర్‌ఆర్‌వీఎస్‌ అభిషేక్‌ రూ.6 వేలు అందించారు. అలాగే అరకులోయకు చెందిన రెండో విజేత కె.మాధురికి సీఐ ఎల్‌.హిమగిరి రూ.4 వేలు ప్రదానం చేయగా, మూడో విజేత పి.లక్ష్మికి పట్టాసి ఫౌండేషన్‌ గౌరవ అధ్యక్షుడు పి.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి పి.చలపతిరావు, ఈసీ మెంబర్‌ పి.జగ్జీవన్‌రావు రూ.3 వేలు అందజేశారు. చక్కని ముగ్గులు వేసిన మరో ఆరుగురు మహిళలు కావశ్రీ నాయక్‌, లావణ్య, వసుంధరదేవి, భూమిక, అంజనిశ్రీ, శైలులకు ప్రత్యేక నగదు బహుమతులను అందజేశారు.

అతిథులకు సత్కారం

ముగ్గుల పోటీల కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వారికి ’ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’, పట్టాసి ఫౌండేషన్‌ తరఫున ఘనంగా సత్కరించారు. పాడేరు డీఎస్‌పీ ఆర్‌ఆర్‌వీఎస్‌ అభిషేక్‌, స్థానిక సీఐ ఎల్‌.హిమగిరి, ఎస్‌.జి.సింహాచలం, పట్టాసి ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ పట్టాసి చలపతిరావులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందించి ‘ఆంధ్రజ్యోతి’ స్టాఫ్‌ రిపోర్టర్‌ బి.నాగరాజు, అరకులోయ రిపోర్టర్‌ ఆర్‌.రవి, ఏబీఎన్‌ రిపోర్టర్‌ ప్రణిత్‌కుమార్‌ పాణిగ్రహి, పాడేరు, డుంబ్రిగుడ రిపోర్టర్లు ఎం.మహేశ్‌బాబు, ఎస్‌.రమేశ్‌, పట్టాసి ఫౌండేషన్‌ ప్రతినిధులు, మహిళా డిగ్రీ కళాశాల సిబ్బంది, తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ శశికుమార్‌, వ్యాయామ సంచాలకురాలు ఎల్‌.జ్యోతి, అధ్యాపకులు డాక్టర్‌ స్వర్ణతల, సీహెచ్‌ రక్షిత, రోజారాణి, సర్వతి, పీవీవీ ప్రసాద్‌, సిబ్బంది రాంబాబు, చంటిబాబు, మహిళలు, యువతులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:37 PM