Share News

‘పేట కోదండరామాలయంలో ఉత్సవ విగ్రహాలు చోరీ

ABN , Publish Date - Jan 07 , 2026 | 12:56 AM

స్థానిక దుర్గానగర్‌లోని కోదండ రామాలయంలో సోమవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతోపాటు హుండీని అపహరించుకుపోయారు. ఇందుకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలిలా వున్నాయి.

‘పేట కోదండరామాలయంలో  ఉత్సవ విగ్రహాలు చోరీ
చోరీకి గురైన పంచలోహ విగ్రహాలు (ఫైల్‌ ఫొటో)

హుండీని సైతం ఎత్తుకెళ్లిన దొంగలు

పాయకరావుపేట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక దుర్గానగర్‌లోని కోదండ రామాలయంలో సోమవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలతోపాటు హుండీని అపహరించుకుపోయారు. ఇందుకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వివరాలిలా వున్నాయి.

దుర్గానగర్‌లోని కోదండరామాలయం అర్చకునిగా వెంకటేశ్‌ వ్యవహరిస్తున్నారు. రోజూ మాదిరిగానే ఆయన సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో గర్భాలయం తలుపులు మూసి, తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం ఆలయంలో మైక్‌ ఆన్‌చేయడానికి కమిటీ సభ్యుల్లో ఒకరైన మహేశ్‌ వచ్చారు. గర్భాలయం ఇనుప తలుపు గడియ విరగ్గొట్టి, తలుపులు తీసివుండడాన్ని గమనించిన ఆయన.. లోపలికి వెళ్లి చూడగా సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి పంచలోహ ఉత్సవ విగ్రహాలు, పక్కనే ఉన్న హుండీ కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు భావించి, వెంటనే అర్చకుడు, ఆలయ కమిటీ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పారు. వారి వచ్చి పరిశీలించిన అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించి, అర్చకుడు, కమిటీ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చోరీకి గురైన ఉత్సవ విగ్రహాల విలువ రూ.1.5 లక్షలు వుంటుందని, హుండీలో కానుకలు ఎంత వుంటాయో అంచనా వేయలేమని చెప్పారు. ఇంకా భక్తులు దీపారాధన కోసం ఇచ్చిన 15 లీటర్ల నూనె టిన్‌ కూడా కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి తరువాత, మంగళవారం తెల్లవారుజాము మధ్యన చోరీ జరిగి వుంటుందని భావిస్తున్నారు. సాయంత్రం ఆలయానికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌.. పలుచోట్ల వేలిముద్రలు సేకరించారు.

Updated Date - Jan 07 , 2026 | 12:56 AM