మార్కెట్‌కు చవితి సందడి
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:57 AM
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరమంతటా సందడి నెలకొంది.
కొనుగోలుదారులతో రహదారులు రద్దీ
పూజా సామగ్రి ధరలకు రెక్కలు
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరమంతటా సందడి నెలకొంది. అనేక ప్రాంతాల్లో యువకులు వినాయక మండపాలు సిద్ధం చేశారు. పూజా సామగ్రి కొనుగోలుకు వచ్చిన వినియోగదారులతో మార్కెట్లు కిటకిటలాడాయి. పూలు, పండ్లు, ఇతర సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో మద్దిలపాలెం, మధురవాడ, దొండపర్తి, అక్కయ్యపాలెం, పూర్ణామార్కెట్, ఎంవీపీ కాలనీ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లు రద్దీగా మారాయి. రైతుబజార్లు కిక్కిరిశాయి. ముఖ్యంగా పూర్ణామార్కెట్, మద్దిలపాలెం, ఆనందపురం పూల మార్కెట్లకు జనం పోటెత్తారు. గత ఏడాదితో పోలిస్తే పూజా సామగ్రి ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులపై అదనపు భారం పడింది. పూల ధరలకు రెక్కలు వచ్చాయి. మూడు, నాలుగు రకాలతో కూడిన పది నుంచి 15 పూలు ఉండే కవర్‌ను రూ.80 నుంచి రూ.100 మధ్య విక్రయించారు. అరటి ఆకులు, పత్రి, మామిడిఆకులు రూ.50కుపైగానే విక్రయించారు. ఒక్కో అరటిఆకు రూ.10 నుంచి రూ.20 వరకు పలికింది. ఇక గణనాథుడి విగ్రహం చిన్నది రూ.50 నుంచి సైజును బట్టి రూ.450 మధ్య ధరల్లో విక్రయించారు. పండ్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. బత్తాయి, నారింజ, వెలగకాయ, రూ.10 చొప్పున, యాపిల్, దానిమ్మ జత రూ.50కు అమ్మకాలు సాగించారు. పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, అగరబత్తీలు, తమలపాకులతో కూడిన కిట్ రూ.50 నుంచి రూ.80 మధ్య ధరల్లో విక్రయించగా, ఒక్కో కొబ్బరికాయ సైజును బట్టి రూ.50 నుంచి రూ.80 వరకు విక్రయించారు.
సిద్ధమైన మండపాలు
నగరమంతటా వీధివీధినా గణనాథుల మండపాలు సిద్ధమయ్యాయి. సోమవారం ఉదయం విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మండపాలకు గణనాథులను చేర్చే క్రమంలో యువత భారీ హంగామా చేశారు. డప్పుల మోతలు, ఈజే సౌండ్స్‌తో నగరమంతటా పండగ వాతావరణం నెలకొంది.