బడిలో పండుగ
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:55 AM
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని (మెగా పీటీఎం 4.0) పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా మెగా పీటీఎం-4.0
పెద్ద సంఖ్యలో పాఠశాలలకు తరలివచ్చిన తల్లిదండ్రులు
ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులు
పిల్లల విద్యా ప్రగతి, అభ్యాసన నైపుణ్యాలు, భవిష్యత్తు లక్ష్యాలపై తల్లిదండ్రులకు అవగాహన
విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
మధ్యాహ్నం సహపంక్తి భోజనాలు
నర్సీపట్నం, మాకవరపాలెంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న
కోటవురట్ల పాఠశాలలో మంత్రి అనిత సందడి
మరుపాక మోడల్ స్కూలు పీటీఎంకు కలెక్టర్ హాజరు
అనకాపల్లి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని (మెగా పీటీఎం 4.0) పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పలుచోట్ల విద్యా సంస్థలను మామిడి ఆకుల తోరణాలు, పూలమాలలు, రంగవల్లుతో ముస్తాబు చేశారు. పాఠశాలలు, కళాశాలలకు వచ్చిన తల్లిదండ్రులకు ఆయా హెచ్‌ఎంలు,ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్వాగతం పలికారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థుల విద్యాప్రగతి, హాజరు, అభ్యాసన నైపుణ్యాలు, భవిష్యత్తు కార్యాచరణ, లక్ష్యాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యా శాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు/ ప్రిన్సిపాళ్లు అన్ని పాఠశాలలు/ కళాశాలల్లో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి విద్యా సంస్థల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేసి, చదువులో వారిని మరింత ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, డిజిటల్ విద్య, మౌలిక వసతుల కల్పన, నాణ్యమైన బోధనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ఎగ్జిబిషన్లు ఆకట్టుకున్నాయి. కొన్నిపాఠశాలల్లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందించారు. పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు, నాయకులు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
పిల్లలను ప్రతిభను గుర్తించాలి: స్పీకర్ అయ్యన్న
శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలోని జడ్పీ ఉన్నత పాఠశాల(తురకబడి), శివపురం మోడల్ ప్రైమరీ స్కూల్లో జరిగిన మెగా పీటీఎం కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులదే అని అన్నారు. ఈ తరం పిల్లల్లో అద్భుతమైన గ్రహణ శక్తి, మేధో సంపత్తి ఉందని, వారిలో ప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించి సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని అన్నారు. మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. రానున్న రోజుల్లో మాకవరపాలెం మండలంలో అనేక భారీ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు కానున్నట్టు చెప్పారు.
నిరుపేద కుటుంబాలకు ‘తల్లికి వందనం’ అండ: మంత్రి అనిత
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎంకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం నిరుపేద కుటుంబాల పిల్లలను బాగా చదివించుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర పురోగతి ఉపాధ్యాయులు విద్యార్థుల నుంచే మొదలవుతుందని అన్నారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పిల్లలను పెద్ద చదువులు చదివించి, భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరేలా తల్లిదండ్రులు సహకరించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా వుండాలని హితవు పలికారు.
భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరాలి: కలెక్టర్ విజయకృష్ణన్
కలెక్టర్ విజయకృష్ణన్ రావికమతం మండలం మరుపాకలోని ఏపీ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమానికి ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, డీఈవో అప్పారావునాయుడుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని ప్రతి విద్యార్థి అర్థం చేసుకొని, వారి కష్టానికి ప్రతిఫలంగా భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరాలని పిలుపునిచ్చారు. బాగా చదువుకోవడం ద్వారానే పేదరికాన్ని జయించి, ఆర్థికంగా స్థిరపడతారని, దీంతో సమాజంలో తగిన గౌరవం లభిస్తుందని చెప్పారు. ప్రతి విద్యార్థి అందుబాటులోఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అనకాపల్లి గాంధీనగరం హైస్కూల్‌లో జరిగిన పీటీఎం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, దేవరాపల్లి మండలం అలమండ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి మండలం కోటనరవ పాఠశాలలో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, మునగపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మెగా పీటీఎం-4.0 కార్యక్రమాలకు హాజరయ్యారు.