Share News

ఖరీఫ్‌ సాగుకు ఎరువులు సిద్ధం

ABN , Publish Date - May 31 , 2026 | 12:39 AM

ఖరీఫ్‌ సాగుకు అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటల సాగు కలిపి 65 వేల హెక్టార్ల పైచిలుకు సాగు జరగనుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.

ఖరీఫ్‌ సాగుకు ఎరువులు సిద్ధం
మునగపాక రైతు సేవా కేంద్రంలో ఎరువులు

- విత్తనాలు కూడా..

- జిల్లాకు 32,615 టన్నుల ఎరువులు

- రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

ఖరీఫ్‌ సాగుకు అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని పంటల సాగు కలిపి 65 వేల హెక్టార్ల పైచిలుకు సాగు జరగనుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.

ఖరీఫ్‌ సాగు లక్ష్యం, విస్తీర్ణం, భూసార పరీక్షల ఆధారంగా మొత్తం 32,615 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మండల వ్యవసాయ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రభుత్వం కూడా ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలను సమకూర్చుతూ జిల్లాకు కేటాయింపులు జరుపుతోంది. ఈ సీజన్‌లో యూరియాకు అధిక డిమాండ్‌ ఉండడంతో 19,178 టన్నుల యూరియా అవసరమని అంచనా వేశారు. కాంప్లెక్స్‌ ఎరువులు 5,263 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 4,043 టన్నులు, ఎస్‌ఎస్‌పీ 2,535 మెట్రిక్‌ టన్నులు, ఎంఓపీ 1,596 టన్నులు అవసరమని ప్రణాళిక రూపొందించారు.

నెలవారీ అవసరాలు ఇలా...

జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు ఖరీఫ్‌ సాగు వేగం పుంజుకోనుంది. ఈ నేపథ్యంలో ఎరువుల వినియోగం కూడా అధికంగా ఉండనుంది. ఎరువుల సరఫరాకు ఏపీ మార్క్‌ఫెడ్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. జూన్‌లో 3,747 టన్నులు, జూలైలో 7,705 టన్నులు, ఆగస్టులో 7,969 టన్నులు, సెప్టెంబరులో అత్యధికంగా 8,033 టన్నులు అవసరమని వ్యవసాయాధికారులు ముందుగానే గుర్తించారు. ఇప్పటికే రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకున్న రైతులకు ఎరువులను పంపిణీ చేస్తున్నారు. రానున్న నెలల్లో ఎరువుల కొరత లేకుండా ఇండెంట్‌ ప్రకారం ఎరువుల నిల్వలను ముందుగానే సిద్ధం చేసేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.

సకాలంలో విత్తనాల పంపిణీకి చర్యలు

జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు మొత్తం 23,998 క్వింటాళ్ల వరి విత్తనాలు కేటాయించారు. రైతులకు సకాలంలో విత్తనాలు అందేలా చర్యలు చేపడుతున్నారు. 22,900 క్వింటాళ్ల వరి విత్తనాలు జిల్లాకు అవసరం కాగా, ఇప్పటికే 70 శాతం విత్తనాలు జూన్‌ 10వ తేదీలోగా రైతులకు అందుబాటులో ఉంచి పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భూసారం పెంపొందించే పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు 1,062 క్వింటాళ్లు జిల్లాకు అవసరమని గుర్తించిన అధికారులు ఇప్పటికే 656 క్వింటాళ్లు రైతు సేవా కేంద్రాలకు చేరవేసి పంపిణీ చేస్తున్నారు.

Updated Date - May 31 , 2026 | 12:39 AM