Share News

మోతాదు మేరకే ఎరువులు

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:48 AM

యూరియా, డీఏపీ, ఇతర రసాయన ఎరువులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మోతాదు మేరకే ఎరువులు

పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు

ఏపీఎయిమ్స్‌ 2.0 పేరుతో కొత్తగా యాప్‌

దీనిద్వారానే ఆర్‌ఎస్‌కేలు, పీఏసీఎస్‌లు, ప్రైవేటు వ్యాపారుల విక్రయాలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

యూరియా, డీఏపీ, ఇతర రసాయన ఎరువులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎరువుల విక్రయం కోసం ‘ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ (ఏపీఎయిమ్స్‌ 2.0) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచే దీనిని అమలు చేయనున్నది.

వ్యవసాయానికి వినియోగించే కొన్ని రకాల ఎరువులపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. కొన్ని రకాల పరిశ్రమల్లో ఉత్పత్తుల తయారీలో భాగంగా యూరియా, ఇతర ఎరువులను వినియోగిస్తుంటారు. వ్యవసాయేతర అవసరాలకు వినియోగించే ఎరువులపై కేంద్రం ఎటువంటి సబ్సిడీ ఇవ్వదు. దీంతో వ్యవసాయ అవసరాలకు కేటాయించిన ఎరువులను కొంతమంది వ్యాపారులు దారి మళ్లించి, వ్యవసాయేతర అవసరాలకు తరలిస్తున్నారు. అంతేకాక పలువురు వ్యాపారులు ఎరువులను బ్లాక్‌ చేసి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అనంతరం రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత ఏడాది చోడవరం, కె.కోటపాడు, అనకాపల్లి మండలాల్లో ఎరువుల డీలర్లు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ తరహా అక్రమాలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎరువుల అక్రమ విక్రయాలతోపాటు పరిమితికి మించి వినియోగాన్ని నియంత్రించేందుకు డిజిటల్‌ విధానాన్ని రూపొందింది. ఇందుకోసం ‘ఏపీఏఐఎంఎస్‌-2.0’ అనే యూప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకముందు ఈ యాప్‌ ద్వారానే ఎరువుల విక్రయాలు జరగాల్సి వుంటుంది. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల సిబ్బంది, ప్రైవేటు డీలర్లు ఈ యాప్‌ ద్వారానే ఎరువులు విక్రయించాలి. జిల్లాలో 290 ఆర్‌ఎస్‌కేలు, 58 పీఏసీఎస్‌లు, 142 మంది ప్రైవేటు డీలర్లు, 25 మంది హోల్‌సేల్‌ వ్యాపారులు ఉన్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఈ-పంట నమోదు వివరాల ఆధారంగా ఈ ఏడాది ఎరువుల కేటాయింపులు జరగనున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని రకాల పంటలకు కలిపి 32,615 టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 19,178 టన్నుల యూరియా, 5,263 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 4,043 టన్నుల డీఏపీ, 2,535 టన్నుల ఎస్‌ఎస్‌పీ, 1,596 టన్నుల ఎంఓపీ వున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఎరువులు సరఫరా చేస్తుంది.

రైతులు ఎరువులు పొందాలంటే..

పంటలకు ఎరువులు అవసరమైన రైతులు ఆర్‌ఎస్‌కేలు/ పీఏసీఎస్‌లు/ ప్రైవేటు దుకాణాలకు వెళ్లి ఆధార్‌ నంబరు చెప్పాలి. సంబంధిత సిబ్బంది/ వ్యాపారి ఈ నంబర్‌ను ‘ఏపీఎయిమ్స్‌’ యాప్‌లో నమోదు చేస్తే.. సదరు రైతు సాగు చేస్తున్న భూమి వివరాలు, ఈ ఏడాది ఖరీఫ్‌లో అతనికి అందజేయాల్సిన ఎరువులు వివరాలు కనిపిస్తాయి. అనంతరం రైతుకు టోకెన్‌ జారీ చేస్తారు. ఇదే సమయంలో రైతు మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. ఆ తరువాత ఎరువులు తీసుకోవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ గత ఏడాది ఒక రైతు చెరకు సాగు చేసి, ఈ ఏడాది వేరే పంటను సాగు చేయాలనుకుంటే సదరు యాప్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చారు. ఈసారి సాగు చేసే పంట వివరాలు నమోదు చేసుకొంటే, ఆ పంటకు ఏ ఎరువు, ఎంత మోతాదులో అవసరమో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు కేటాయింపులు జరుపుతారు.

మోతాదుకు మించి వాడకుండా...

సాధారణంగా వరి పంటకు ఎకరాకు 69 కిలోల యూరియా వేయాలి. కానీ చాలా మంది రైతులు సరైన అవగాహన లేకపోవడం, ధర తక్కువ అన్న ఉద్దేశంతో 145 కిలోల వరకు యూరియాను వినియోగిస్తున్నారు. అదే విధంగా చెరకు పంటకు 97 కిలోలు వినియోగించాల్సి వుండగా, 220 కిలోలు వాడుతున్నారు. మోతాదుకు మించి యూరియాను వేయడం వల్ల పంటలకు తెగుళ్ల బెడద అధికం అవుతుంది.

యాప్‌ ద్వారానే ఎరువుల విక్రయాలు

ఆశాదేవి, జిల్లా వ్యవసాయాధికారి

జిల్లాలో పంటలు సాగు చేసే ప్రతి ఎకరాకు ప్రభుత్వం ఎరువులు సరఫరా చేస్తుంది. ఈ-క్రాప్‌ నమోదు ఆధారంగానే యూరియా, డీఏపీ, ఇతర ఎరువులు సరఫరా అవుతాయి. గత ఏడాది (2025-26) ఈ-క్రాప్‌ నమోదు చేసుకోని రైతులు ఎవరైనా వుంటే వెంటనే ఆధార్‌ కార్డు, పట్టాదారుపాసు పుస్తకంతో మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలి. అంతేకాక ఈ ఏడాది పంట మార్పిడి జరిగితే రైతు సేవా కేంద్రాలకు వెళ్లి వివరాలను ‘ఏపీఎయిమ్స్‌’ యాప్‌లో నమోదు చేయించుకోవాలి. ఈ యాప్‌ ద్వారానే ఎరువుల విక్రయాలు జరుగుతాయి. దీనివల్ల ఎరువులను సకాలంలో పొందే అవకాశం వుంటుంది. ఎరువుల కొరత సమస్య తలెత్తదు.

Updated Date - Jun 09 , 2026 | 01:48 AM