Share News

ప్రభుత్వ భూమికి ఎసరు

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:51 AM

భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. నగరంలో ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వ భూమికి ఎసరు

పీఎం పాలెం సర్వేనంబర్‌ 20-4లో 2.82 ఎకరాలు

ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు

రాత్రికిరాత్రే భూమిలోకి ప్రైవేటు వ్యక్తులు

యంత్రాలతో చదును చేయించేందుకు యత్నం

ప్రశ్నించిన స్థానికులపై తాము కొనుగోలు చేశామంటూ రుబాబు

రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అందడంతో పనులు నిలిపివేత

విలువ రూ.70 కోట్లుపైనే...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. నగరంలో ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి వస్తే...పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపాన పాత ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వెనుక గల 2.82 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉంది. ఎకరా కనీసం రూ.35 కోట్లు పలుకుతుంది. అంతటి విలువైన భూమిపై కొందరు కన్నేశారు. రాత్రికి రాత్రే ఆ భూమిలోకి ప్రవేశించి యంత్రాలతో చదునుచేయడం ప్రారంభించారు. స్థానికులు ప్రశ్నిస్తే తాము కొనుగోలు చేశామని, వారం రోజుల్లో ప్రహరీగోడ నిర్మిస్తామని బదులిచ్చారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కబ్జాదారులు అక్కడి నుంచి పరారైపోయారు.

రాష్ట్ర విభజన తర్వాత విశాఖలో భూములకు డిమాండ్‌ పెరిగింది. ఐటీ కంపెనీల రాకతో మధురవాడ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు మరింతప్రియంగా మారాయి. దీంతో కబ్జాదారులు ఎక్కడైనా ఖాళీగా భూమి కనిపిస్తే చాలు తప్పుడు పత్రాలు సృష్టించి రాత్రికి రాత్రే ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపంలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న పాత ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ వెనుక సర్వే నంబర్‌ 20-4లో 2.82 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి చుట్టూ అనేక విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. అలాంటి ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిపై కొందరు కబ్జాదారులు కన్నేశారు. కోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారుల నుంచి పట్టా తీసుకున్నట్టు చెబుతున్న ఒక మహిళ ఆ భూమిని అమ్మకానికి పెట్టగా అధికారులు గతంలో న్యాయస్థానంలో కౌంటర్‌ దాఖలు చేశారు. 2021లో ఆ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డు ఏర్పాటుచేశారు. ఆ భూమిని ఆక్రమించడానికి ఒక మహిళ యత్నించారంటూ దాదాపు ఐదేళ్ల కిందట చినగదిలి తహశీల్దార్‌ ఫిర్యాదుతో పీఎం పాలెం పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలావుండగా అదే ప్రభుత్వ భూమిని శనివారం ఉదయం కొందరు యంత్రాలతో చదునుచేయడం ప్రారంభించారు. ప్రభుత్వ భూమిలో పనులు చేస్తుండడంతో కొందరు అక్కడున్న వారిని ప్రశ్నించారు. తాము ఒక మహిళ నుంచి భూమిని కొనుగోలు చేశామని, వారం రోజుల్లో ప్రహరీ గోడ నిర్మించేస్తామని, ఎవరొస్తారో చూస్తామంటూ దురుసుగా సమాధానమిచ్చారు. దీనిపై స్థానికులు కొందరు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బందిని అక్కడకు పంపించి పనులు నిలుపుదల చేయించారు. దీనిపై చినగదిలి రెవెన్యూ అధికారులను వివరణ కోరగా సర్వే నంబర్‌ 20-4లో భూమి పక్కా ప్రభుత్వ భూమి అని, అందులో పనులు చేస్తున్నట్టు సమాచారం రాగానే సిబ్బందిని పంపి నిలుపుదల చేయించామని సమాధానం చెప్పారు. అయితే భూమిని చదును చేసేందుకు యత్నించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 05 , 2026 | 12:51 AM