ప్రభుత్వ భూమికి ఎసరు
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:18 AM
ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెంలో 10.62 ఎకరాల ప్రభుత్వ భూమి (22 ఏ జాబితాలో కూడా ఉంది)ని కొందరు చదును చేస్తున్నారు. నాలుగైదు దశాబ్దాల క్రితం డీపట్టాలు పొందిన రైతుల వారసుల నుంచి తాము భూమి కొనుగోలు చేశామని చెప్పుకుంటున్నారు. ఈ భూమి విలువ సుమారు రూ.300 కోట్ల ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
10.62 ఎకరాలు...విలువ రూ.300 కోట్లు
నాలుగు దశాబ్దాల కిందట డీపట్టాలు
ఇరవై ఏళ్ల కిందట అమ్ముకున్న పట్టాదారుల వారసులు
డీపట్టా భూముల విక్రయం నిబంధనలకు విరుద్ధం
ఆ మేరకు ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ
హెచ్చరిక బోర్డులు పెట్టిన రెవెన్యూశాఖ
ప్రస్తుతం 22ఏ జాబితాలో ఉన్న భూమి
వారం రోజులుగా చదును చేస్తున్న ప్రైవేటు వ్యక్తులు
విశాఖపట్నం/ఆనందపురం,
ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెంలో 10.62 ఎకరాల ప్రభుత్వ భూమి (22 ఏ జాబితాలో కూడా ఉంది)ని కొందరు చదును చేస్తున్నారు. నాలుగైదు దశాబ్దాల క్రితం డీపట్టాలు పొందిన రైతుల వారసుల నుంచి తాము భూమి కొనుగోలు చేశామని చెప్పుకుంటున్నారు. ఈ భూమి విలువ సుమారు రూ.300 కోట్ల ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
బొడ్దపాలెం సర్వే నంబరు 292లో నాలుగైదు దశాబ్దాల క్రితం దారసి అప్పారావురెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు 10.62 ఎకరాలకు డీపట్టాలు ఇచ్చారు. అయితే ఆ భూములను దాసరి అప్పారావు వారసులు 2004 తరువాత 2.62 ఎకరాలు, నాలుగు ఎకరాలు, నాలుగు ఎకరాలు వంతున ముగ్గురికి విక్రయించి రిజిస్టర్ చేశారు. అయితే డీపట్టా భూముల క్రయవిక్రయాలు చెల్లవు. డీపట్టా పొందిన వ్యక్తులు లేదా వారి వారసులు వ్యవసాయం లేదా తోటలు పెంచుకుని జీవనం సాగించాల్సి ఉంటుంది. డీపట్టా భూములు చేతులు మారాయనే విషయం తెలియడంతో 2007లో అప్పటి ఆనందపురం తహశీల్దారుకు మొత్తం 10.62 ఎకరాలు ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. దీనిపై భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఒకరు కోర్టులో కేసు వేశారు. ఆ తరువాత 2014, 2021లో భూమిలో ప్రవేశించేందుకు ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో 10.62 ఎకరాలను నిషేధిత భూముల జాబితా 22(ఎ)లో చేర్చారు. ప్రస్తుతం ఈ భూములు 22(ఎ)లోనే ఉన్నాయి. అయితే భూములు కొనుగోలు చేసిన వారిలో ఒకరు వారం క్రితం ప్రొక్లెయినర్లతో రాళ్ల గుట్టలను తవ్వి బయటకు తరలిస్తున్నారు. భూమిని చదును చేస్తున్నారు. రాళ్ల గుట్టలను తవ్వి బయటకు తరలించేందుకు గనుల శాఖ, గ్రామ పంచాయతీ అనుమతి లేదు. ప్రస్తుతం 22(ఎ)లో ఉండడంతో అనుమతులు ఇచ్చే అవకాశం లేదు. ప్రభుత్వ భూమిని చదునుచేస్తున్న విషయం తెలుసుకున్న ఆనందపురం మండల తహశీల్దార్ శీనుబాబు వెంటనే సిబ్బందిని పంపించి పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ విషయమై తహశీల్దార్ మాట్లాడుతూ సర్వేనంబరు 292లో ఉన్న 10.62 ఎకరాలు ప్రభుత్వ భూమి అని స్పష్టంచేశారు. దీనిపై కొందరు కోర్టులో వేసిన కేసులు విచారణలో ఉన్నాయన్నారు. డీపట్టా భూములు అనుమతులు తీసుకోకుండా విక్రయించరాదని, గతంలో చేసిన అమ్మకాలు చెల్లవన్నారు.
పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి తిరస్కృతి
బొడ్డపాలెంలో డీపట్టాభూములు కొనుగోలుచేసిన వ్యక్తులు గతంలో పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేయగా ఆనందపురం తహశీల్దారు తిరస్కరించారు. దాంతో విశాఖ ఆర్డీవో కోర్టులో కేసు దాఖలుచేశారు. డీపట్టా భూముల కొనుగోలు చెల్లదని పేర్కొంటూ ఆర్డీవో సదరు కేసును కొట్టివేశారు. దీనిపై కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆర్డీవో వద్దే సమస్య పరిష్కరించుకోవాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం భీమిలి ఆర్డ్డీవో వద్ద కేసు పెండింగ్‌లో ఉంది.
విచారణ చేస్తున్నాం
భీమిలి ఆర్డీవో సంగీత్ మాథుర్
ఆనందపురం మండలం వెల్లంకి రెవెన్యూ పరిధి బొడ్డపాలెంలో సర్వే నంబర్ 292లో భూములను క్లెయిమ్ చేసుకుంటున్న వ్యక్తులకు సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని గురువారం రావాలని సూచించాం. ప్రభుత్వ భూమిలో చొరబడిన వారి వివరాలు సేకరిస్తున్నాము. తప్పుడు ఆధారాలతో ఉన్న భూమిలో ప్రవేశించిన వ్యక్తులపై కేసు నమోదుచేస్తాం.