రోడ్డు ప్రమాదంలో మహిళా రైతు మృతి
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:48 AM
మండలంలోని చిన్నయ్యపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా రైతు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
సబ్బవరం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నయ్యపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా రైతు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
కె.కోటపాడు మండలం సంతపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు నంబారు ఈశ్వరమ్మ (38) తన సోదరుడు సన్నిబాబుకు చెందిన ఆటోలో కూరగాయలు వేసుకొని శుక్రవారం తెల్లవారుజామున చిన్నయ్యపాలెం సంతకు బయలుదేరారు. గులేపల్లి మీదుగా పాతరోడ్డుకు చేరుకొని, అక్కడి నుంచి జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో చిన్నయ్యపాలెం వెళుతున్నారు. ఈ సమయంలో పొగమంచు దట్టంగా కురుస్తున్నది. చిన్నయ్యపాలెం సమీపంలోకి వచ్చేసరికి పెందుర్తి వైపు నుంచి వస్తున్న బొలేరు వాహనం, ఆటోను బలంగా ఢీకొన్నది. దీంతో ఆటోలో ఉన్న ఈశ్వరమ్మ రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆటో నడుపుతున్న సన్నిబాబుకు పలుచోట్ల గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో కొద్ది సేపటికే 108 అంబులెన్స్ వచ్చింది. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈశ్వరమ్మకు తీవ్రరక్తస్రావం కావడంతో ఉదయం తొమ్మిది గంటల సమయంలో మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈశ్వరమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. భర్త అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ జి.రామచంద్రరావు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బొలేరో వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.