Share News

బిర్యానీకి ఫిదా

ABN , Publish Date - Jan 10 , 2026 | 01:37 AM

నగర వాసులు బిర్యానీకి ఫిదా అయిపోతున్నారు.

బిర్యానీకి ఫిదా

ఇదీ నగరవాసుల అభిరుచి

గత ఏడాది ఒక్క ‘స్విగ్గీ’లోనే 13.12 లక్షల ఆర్డర్లు

తరువాతి స్థానంలో దోశ, ఇడ్లీ

రాత్రి 12 గంటల తరువాత కూడా...

అత్యధిక సింగిల్‌ బిల్లు రూ.17,926

గత ఏడాదితో పోలిస్తే 48 శాతం మేర పెరుగుదల

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర వాసులు బిర్యానీకి ఫిదా అయిపోతున్నారు. సమయంతో సంబంధం లేకుండా నచ్చిన హోటల్‌ నుంచి ఆర్డర్‌ పెట్టుకుని ఆరగించేస్తున్నారు. జిహ్వ చాపల్యాన్ని తీర్చుకునేందుకు అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఎంతోమంది ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టేస్టున్నారు.

గత ఏడాది నగరవాసులు ఆన్‌లైన్‌ ఆర్డర్లకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం 2025లో విశాఖ ప్రజలు ఒక్క ‘స్విగ్గీ’లోనే 13.12 లక్షల బిర్యానీలను ఆర్డర్లు పెట్టారు. వీటిలో కొన్ని వేల బిర్యానీలు అర్ధరాత్రి 12 గంటల తరువాత వచ్చినవే అంటే అభిరుచి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగానే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విభిన్నమైన ఫ్లేవర్స్‌తో చికెన్‌, మటన్‌, ప్రాన్‌ వంటి బిర్యానీలను అందిస్తున్న రెస్టారెంట్లు, ఫుడ్‌స్టాల్స్‌ పెరుగుతున్నాయి. హౌ ఇండియా స్విగ్గీడ్‌ నివేదికలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడయ్యాయి.

48 శాతం పెరిగిన ఆర్డర్లు..

గతంతో పోలిస్తే నగర వాసుల నుంచి 48 శాతం మేర ఆర్డర్లు పెరిగాయి. 2024తో పోలిస్తే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల మధ్య బిర్యానీతో పాటు ఇతర ఆహార పదార్థాల ఆర్డర్లు దాదాపు రెట్టింపయ్యాయి. ఇందులో చికెన్‌ బిర్యానీ అధికంగా ఉంది. 2025లో 13.12 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఇదే ఆర్డర్లు జాబితాలో టాప్‌లో నిలిచింది. అర్ధరాత్రి వచ్చిన ఆర్డర్లలో చికెన్‌ బిర్యానీ టాప్‌లో ఉండగా, తరువాతి స్థానంలో చికెన్‌ బర్గరు నిలిచింది.

171 శాతం మేర పెరుగుదల

ప్రయాణ వేళల్లో ఆహారం కోసం ఆర్డర్లు పెట్టే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఫుడ్‌ ఆన్‌ ట్రైన్‌ ఫీచర్‌ ద్వారా పెట్టుకున్న ఆర్డర్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 171 శాతం మేర పెరిగాయి. చికెన్‌ బిర్యానీ తరువాత ఓవరాల్‌ ఆర్డర్స్‌లో రెండో స్థానంలో వెజ్‌ దోశ, మూడో స్థానంలో ఇడ్లీ నిలిచాయి. పనిచేసే వేళల్లో ఉద్యోగులు ఆహార పదార్థాలను ఆర్డర్‌ పెట్టుకునేందుకు ఇష్టపడుతున్నారు. రోజుకు 157 ఆర్డర్లతో చికెన్‌ పాప్‌కార్న్‌ ప్రథమ స్థానంలో నిలవగా, వెజ్‌ ఇడ్లీ, మసాలాదోశ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

హై ప్రొటీన్‌ ఫుడ్‌పై ఆసక్తి

ఆరోగ్యానికి మేలు చేసే హై ప్రొటీన్‌ ఉన్న ఆహార పదార్థాలను ఆర్డర్‌ పెట్టుకున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఇలాంటివి గత ఏడాది 2.12 లక్షల ఆర్డర్లు వచ్చాయి. అదే సమయంలో స్వీట్స్‌ ఆర్డర్లు పెరిగాయి. ఇందులో రసమలై టాప్‌లో నిలవగా, బొబ్బట్లు, చాకో లావా కేకులు తరువాత స్థానంలో ఉన్నాయి. వీటితోపాటు చాక్లెట్‌ కేకులు, కాజూ బర్ఫీ, బేసన్‌ లడ్డూలకూ డిమాండ్‌ ఏర్పడింది.

భారీ ఆర్డర్లు ఇవే..

నగరానికి చెందిన ఒకరు మదర్స్‌డే రోజు సింగిల్‌ బిల్లులో రూ.17,926, ఫాదర్స్‌డేకి ఓ వ్యక్తి రూ.16,895 వెచ్చించారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టుకుని ఇంట్లోనే వేడుకలను, ప్రత్యేకరోజులను జరుపుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.

స్నాక్స్‌కు భారీగా...

సాయంత్రం మూడు నుంచి ఏడు గంటల మధ్య స్నాక్స్‌ ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో చికెన్‌ బర్గర్లు టాప్‌లో ఉంటే, వెజ్‌ బర్గర్లు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత చికెన్‌ రోల్‌, వెజ్‌ పిజ్జా, చికెన్‌ నగ్గట్స్‌ నిలిచాయి. ఇక అల్లం చాయ్‌ కోసం కూడా భారీగా ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ వెల్లడించింది.

Updated Date - Jan 10 , 2026 | 01:37 AM