Share News

ఫీజుల పరేషాన్‌.!

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:05 AM

జిల్లాలో ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులను ఫీజులు పరేషాన్‌కు గురిచేస్తున్నాయి.

ఫీజుల పరేషాన్‌.!

విద్యార్థుల నుంచి వసూలుచేస్తున్న కాలేజీ యాజమాన్యాలు

ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఇబ్బందులు

నిధులు జమ కాకపోవడంతో ఒత్తిడి

విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులను ఫీజులు పరేషాన్‌కు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేయకపోవడతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం సుమారు ఏడు క్వార్టర్ల ఫీజులను పెండింగ్‌లో పెట్టడంతో 2022-23, 2023-24 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఐటీఐ కోర్సుల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పెండింగ్‌ ఫీజుల బాధ్యత కూడా కూటమి ప్రభుత్వంపై పడింది.

ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించేందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజులు కిందట రూ.1,200 కోట్లు విడుదల చేసింది. అయితే వారం రోజులు గడిచినా ఇప్పటికీ కాలేజీ ఖాతాలకు డబ్బు జమ కాలేదని, ఈ నేపథ్యంలో విద్యార్థులే చెల్లించాలని యాజమాన్యాలు వేధిస్తున్నాయి. మరోవైపు అధికారులు మాత్రం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కాలేజీ ఖాతాలకు జమ అవుతున్నాయని చెబుతున్నారు.

తప్పని ఇబ్బందులు..

గత ప్రభుత్వం విద్యార్థుల ఖాతాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ మొత్తాలను చెల్లించేది. దీనివల్ల ప్రభుత్వం చెల్లించినా, చెల్లించకపోయినా విద్యార్థులు తప్పనిసరిగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ విధానం వల్ల వైసీపీ హయాంలో వేలాది మంది విద్యార్థులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం పూర్వ విధానాన్ని అమలుచేయడంతో కళాశాలల ఖాతాలకే నిధులు జమవుతాయి. దీంతో ఫీజుల బాధ తప్పుతుందని విద్యార్థులు భావించారు. ఈ నేపథ్యంలో ఫీజుల విషయమై యాజమాన్యాలు ప్రభుత్వంతో చర్చించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులను ఒత్తిడి చేయకూడదని అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ అనేక కాలేజీల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నాయి. లేదంటే పరీక్షలకు హాజరుకానీయబోమంటూ హెచ్చరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు విడతలు వారీగా ఫీజులు చెల్లిస్తున్నారు. ఇప్పటికే గడిచిన విద్యా సంవత్సరం, ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను ఎంతో మంది విద్యార్థులు చెల్లించారు. ప్రభుత్వం నుంచి జమ అయిన తరువాత తమ డబ్బులు వెనక్కి ఇస్తారా.? అన్న ప్రశ్నలకు కాలేజీ యాజమాన్యాలు సమాధానం చెప్పడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

ఇదీ లెక్క..

జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఐటీ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులు సుమారు 80 వేల మంది వరకు ఉంటారు. వీరికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఏటా ప్రభుత్వం సుమారు రూ.70 నుంచి రూ.80 కోట్ల వరకు చెల్లిస్తుంది. గడిచిన కొన్ని క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు విడుదల చేయకపోవడంతో బకాయిల భారం విద్యార్థులపై పడుతోంది.


ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా సిద్ధం

విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను విద్యాశాఖ వెబ్‌సైట్‌, విద్యాశాఖ కార్యాలయం నోటీస్‌ బోర్డులో అందుబాటులో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు. ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని జాబితా రూపొందించామని వెల్లడించారు. జాబితాపై అభ్యంతరాలను ఈనెల ఏడోతేదీలోగా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.


రేపు ఆలయాల మూసివేత

చంద్ర గ్రహణం ఎఫెక్ట్‌

విశాఖపట్నం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి):

చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం జిల్లాలోని ప్రధాన ఆలయాలన్నీ ముతపడనున్నాయి. సింహాచలంలోని వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయాన్ని ఉదయం 8 గంటలకే కవాట బంధనం చేస్తామని, భక్తులకు దర్శనాలు లభించవని ఈవో వెంకటరావు తెలిపారు. సంపత్‌ వినాయగర్‌ ఆలయం, ఇసుక కొండ సత్యనారాయణస్వామి ఆలయాల్లో మంగళవారం ఉదయం 11 గంటల వరకు భక్తుల దర్శనాలకు అనుమతిస్తామని, అనంతరం మూసివేసి, తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు వివరించారు. కాగా కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఉదయం 11 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మూసివేసి, సంప్రోక్షణ అనంతరం మంగళవారం రాత్రి దర్శనాలకు అనుమతిస్తామన్నారు.

Updated Date - Mar 02 , 2026 | 01:05 AM