ఫీజులుం
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:41 AM
జిల్లాలోని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఫీజుల దోపిడీకి తెరతీశాయి. ప్రభుత్వం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి సీటు కేటాయించినా, ఫీజు చెల్లిస్తేనే ప్రవేశం కల్పిస్తామని భయపెడుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని చెప్పినా వినకుండా, నిర్దేశించిన ట్యూషన్ ఫీజులు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. లేదంటే సీటు ఇవ్వం పొమ్మంటున్నాయి.
డిగ్రీ కళాశాలల యాజమాన్యాల రుబాబు
ట్యూషన్ ఫీజు కంటే అధికంగా వసూలు
రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని చెప్పినా
పరిగణనలోకి తీసుకోకుండా దబాయింపు
ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌తో సంబంధం లేదని బుకాయింపు
ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి
తొక్కుతున్న అనేక విద్యా సంస్థలు
విశాఖపట్నం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఫీజుల దోపిడీకి తెరతీశాయి. ప్రభుత్వం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి సీటు కేటాయించినా, ఫీజు చెల్లిస్తేనే ప్రవేశం కల్పిస్తామని భయపెడుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని చెప్పినా వినకుండా, నిర్దేశించిన ట్యూషన్ ఫీజులు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. లేదంటే సీటు ఇవ్వం పొమ్మంటున్నాయి.
ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించి డిగ్రీ సీట్లు కేటాయిస్తోంది. కోర్సును బట్టి ఫీజు నిర్దేశించింది. బీఏ విద్యార్థులకు రూ.12,500, హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు గరిష్ఠంగా సుమారు రూ.30 వేల వరకు ఫీజుగా నిర్ణయించింది. కాగా ఈ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలకు వెళితే యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ట్యూషన్ ఫీజు కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి. తాజాగా నగర పరిధిలో ఓ ప్రముఖ కాలేజీలో సీటు దక్కించుకున్న విద్యార్థి అడ్మిషన్ కోసం ఫీజు చెల్లించాలని యాజమాన్యం డిమాండ్ చేసింది. తనకు రీయింబర్స్‌మెంట్ వస్తుందని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.22 వేల ఫీజుకు బదులుగా రూ.40 వేలు చెల్లించాలని ఒత్తిడి చేసింది. లేదంటే సీటు క్యాన్సిల్ అవుతుందని చెప్పడంతో చేసేదేమీ లేక ఆ విద్యార్థి యాజమాన్యం చెప్పిన మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. మరో ప్రముఖ కాలేజీ బీఎస్సీలో చేరేందుకు వెళ్లిన విద్యార్థిని కౌన్సెలింగ్‌తో సంబంధం లేదని, రూ.80 వేలు చెల్లిస్తేనే సీటు కేటాయిస్తామని స్పష్టం చేయడంతో తల్లిదండ్రులు వెనక్కి రావాల్సి వచ్చింది.
అవస్థలు పడుతున్న విద్యార్థులు
నగర పరిధిలోని అనేక డిగ్రీ కాలేజీలు ఇదే వైఖరిని అవలంబిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులతో కాలేజీలను నిర్వహించలేమంటూ అదనంగా రూ.వేలు వసూలుచేస్తూ విద్యార్థులను అవస్థలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులు ఫీజులు చెల్లించలేక వెనక్కి తగ్గుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి న్యాయం చేయాలని, ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.