ఫీజు కష్టాలు
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:14 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొందరు విద్యార్థులకు అటెండెన్స్ సమస్య కారణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించడం లేదు.
రీయింబర్స్‌మెంట్‌కు ఎదురుచూపులు
జ్ఞానభూమి పోర్టల్‌లో అటెండెన్స్ అప్‌లోడ్ కాకపోవడంతో ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి వర్తించని పథకం
ఉన్నతాధికారులకు కళాశాలల యాజమాన్యాలు లేఖలు రాస్తున్నా ప్రయోజనం సున్నా
మరోవైపు విద్యార్థులపై యాజమాన్యాల ఒత్తిడి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొందరు విద్యార్థులకు అటెండెన్స్ సమస్య కారణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించడం లేదు. సాధారణంగా విద్యార్థుల అటెండెన్స్ వివరాలను జ్ఞానభూమి పోర్టల్‌లో కాలేజీ యాజమాన్యాలు అప్‌లోడ్ చేయాలి. అయితే, గడిచిన విద్యా సంవత్సరం (2025-26) తొలి విడతలో చేరిన కొందరు విద్యార్థులకు, రెండు, మూడు విడతల్లో ప్రవేశాలు పొందిన వారికి సంబంధించిన హాజరు వివరాలను సాంకేతిక ఇబ్బందుల కారణంగా జ్ఞానభూమి పోర్టల్‌లో కళాశాలల యాజమాన్యాలు అప్‌లోడ్ చేయలేకపోయాయి. అటెండెన్స్ జీరోగా చూపించడంతో వారంతా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనర్హులుగా మారిపోయారు. ఇదే విషయాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి కళాశాలల యాజమాన్యాలు తీసుకువెళ్లాయి. కొంతమంది విద్యార్థులకు సంబంధించి జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలు, మరికొన్ని కాలేజీల విద్యార్థులకు సంబంధించి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలలకు సంబంధించిన అటెండెన్స్ వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయలేని పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల వేలాది మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కాలేదని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. గడచిన ఏడాది నుంచి ఉన్న ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటివరకూ ఒక్కరికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు జమ కాలేదు. ఈ నేపథ్యంలో ఫీజులు చెల్లించాలని విద్యార్థులను కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు సంక్షేమ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
75 శాతం హాజరు ఉంటేనే..
విద్యార్థులకు తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధన ఉంది. ఆ మేరకు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు స్కాలర్‌షిప్ ఇస్తోంది. అయితే, సాంకేతిక కారణాల వల్ల రెండు, మూడు ఫేజ్‌లలో చేరిన విద్యార్థుల హాజరు నమోదు చేసేందుకు జ్ఞానభూమి పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో గడిచిన ఏడాది డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్, ఐటీఐ వంటి వివిధ కోర్సుల్లో చేరిన పలువురు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జ్ఞానభూమి పోర్టల్‌ను ఓపెన్ చేసి అటెండెన్స్ వివరాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.
భారీగా వినతులు
ఒకవైపు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడం, మరోవైపు కాలేజీల యాజ మాన్యాలు నుంచి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి వస్తుండడంతో విద్యార్థులు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. బీసీ సంక్షేమశాఖ అధికారులు వద్దకు ఈ తరహా ఇబ్బందులతో వస్తున్న విద్యార్థుల సంఖ్య అధికంగానే వస్తోంది. అయితే, ఈ సమస్య పరిష్కారం తమ చేతిలో లేదని, రాష్ట్ర స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అనర్హులుగా మారినట్టు చెబుతున్నారు.
కేజీహెచ్‌లో మందుల కొరత
రోగుల ఇబ్బందులు
బయట కొనుగోలు
చేసుకోవాలంటున్న సిబ్బంది
సుమారు 50 రకాల మందుల కోసం
అధికారులకు ఇండెంట్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రి కేజీహెచ్‌ను మందుల కొరత వేధిస్తోంది. అవుట్ పేషెంట్లతో పాటు ఇన్‌పేషెంట్లుగా చేరిన వారికి ఇవ్వాల్సిన అనేక రకాల మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండడం లేదు. బయట కొనుక్కోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. ముఖ్యంగా శస్త్ర చికిత్స/ప్రసవ సంబంధిత నొప్పుల నివారణకు ఇచ్చే బ్యూటర్‌ఫోనల్, మెదడు/నాడీ సంబంధిత సమస్యల్లో...స్ర్టోక్ లేదా మెదడు గాయాల సందర్భాల్లో సహాయక చికిత్సకు ఇచ్చే సిటికోలిన్, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్‌గా వినియోగించే క్లిండర్‌మైసిన్ (150 ఎంజీ), విటమిన్ కె లోపం, రక్తస్రావం/రక్తం గడ్డకట్టడంలో సమస్యలు ఉన్నప్పుడు ఇచ్చే మెనోడియన్ సోడియం బిసల్ఫైట్ (విటమిన్ కె), విటమిన్ బి1 లోపం, కొన్ని నాడీ/పోషక లోప సమస్యలతో బాధపడే రోగులకు ఇచ్చే థయమిన్ 1000 ఎంజీ ఇంజెక్షన్, మూర్ఛ నియంత్రణకు ఇచ్చే లావెట్రాసిటెమ్, నొప్పి నివారణకు, ఆపరేషన్ సమయంలో అనస్థీషియాకు ఇచ్చే ఫెంటాన్యల్, వాపు, టిష్యూ తగ్గించేందుకు ఇచ్చే సెరాపెప్టిడాజ్ 10 ఎంజీ, ఇంకా అధిక రక్తపోటు నియంత్రణ, టైప్ 2 డయాబెటిస్, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇవ్వాల్సిన అనేక రకాల మందులు ఆస్పత్రిలో లేవు. దీనివల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ మందులను బయట కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. సుమారు 50 రకాల మందులు అందుబాటులో లేవని, వెంటనే తెప్పించాలని అధికారులకు ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది ఇండెంట్ పెట్టారు.
కార్డుదారులకు రాగులు లేనట్టే
ఒకటో తేదీ నుంచి బియ్యం, పంచదార, గోధుమపిండి పంపిణీ
విశాఖపట్నం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి):
బియ్యం కార్డుదారులకు సరఫరా చేసే సరుకుల జాబితా నుంచి వచ్చే నెల రాగులు కట్ చేశారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రెండు నెలలపాటు కార్డుకు మూడు కిలోలు చొప్పున రాగులు పంపిణీ చేసిన అధికారులు ఆ తరువాత రెండు నెలలపాటు నిలిపివేశారు. మళ్లీ మే నెలలో ఇచ్చి, జూన్ నుంచి సరఫరా నిలిపివేశారు. గోదాములో మిగిలిన రాగులను ఆగస్టు నెలలో కొందరు కార్డుదారులకు పంపిణీ చేశారు. సెప్టెంబరు నెలకు సంబంధించి రాగులను పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేయకపోవడంతో జిల్లాలకు రాలేదని డీలర్లు అంటున్నారు. జిల్లాలో గల 5.17 లక్షల బియ్యం కార్డులకు మూడు కిలోలు వంతున పంపిణీ చేయాలంటే 1,500 టన్నుల అవసరం. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రతి నెలా 300 నుంచి 400 టన్నులు మాత్రమే ఇచ్చేవారు. వాటిని డీలర్లు ముందుగా వచ్చిన కార్డుదారులకు పంపిణీ చేసేవారు. నగరంలో చాలామంది రాగులు తీసుకునేందుకు మొగ్గుచూపేవారు. ఒకటో తేదీ నుంచి బియ్యం, పంచదార, గోధుమపిండి పంపిణీ చేయనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు స్టాకు రేషన్ డిపోలకు చేరింది.