అప్పన్న సొమ్ము ఆరగింపు!
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:50 AM
సింహాచలం దేవస్థానానికి భక్తుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని వివిధ పద్దుల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సింహ‘గిరి ప్రదక్షిణ’ సందర్భంగా సిబ్బంది భోజనానికి అయిన ఖర్చు రూ.83.83 లక్షలట!
అధికారుల లెక్కలు
గతంలో అన్నదాన సత్రంలోనే తయారీ, పంపిణీ
ఈ ఏడాది కాంట్రాక్టర్‌కు అప్పగింత
రెండింతలు బిల్లు పెట్టారనే ఆరోపణలు
విస్తుపోతున్న సిబ్బంది
దేవుడి సొమ్ము అప్పనంగా దోచిపెడుతున్నారని విమర్శలు
ఇప్పటికే హౌస్ కీపింగ్ కాంట్రాక్టుకు అదనంగా నెలకు రూ.24 లక్షలు చెల్లింపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సింహాచలం దేవస్థానానికి భక్తుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని వివిధ పద్దుల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల హౌస్ కీపింగ్ కాంట్రాక్టును పెద్దలు చెప్పారని అధిక మొత్తానికి అడ్డగోలుగా అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ నెలకు రూ.16 లక్షల వ్యయం అవుతున్న హౌస్ కీపింగ్ కాంట్రాక్టును 150 శాతం అధికానికి అంటే రూ.40 లక్షలకు రాయలసీమకు చెందిన వ్యక్తికి కట్టబెట్టారు. ఈ ఒక్క కాంట్రాక్టు ద్వారానే దేవస్థానంపై నెలకు రూ.24 లక్షలు అదనపు భారం పడింది. దీనికి తాజాగా బుధవారం జరిగిన పాలక మండలి సమావేశం కూడా ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. ఈ ఏడాది జూలై 28వ తేదీన జరిగిన గిరి ప్రదక్షిణకు వివిధ శాఖల నుంచి విధులకు హాజరైన సిబ్బందికి భోజనాల ఖర్చు రూ.83.82 లక్షలు అయినట్టు చూపించారు. ఈ ఉత్సవ నిర్వహణకు వచ్చిన ప్రభుత్వ సిబ్బంది భోజనాలకే ఈ మొత్తం వెచ్చించారంటే...ఇక ఉత్సవానికి ఎంత ఖర్చు చేశారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూడేళ్ల నుంచి దారి తప్పింది
గిరి ప్రదక్షిణ విధులకు వచ్చే ఉద్యోగులకు ఇంతకుముందు అన్నదాన సత్రం సిబ్బందితో భోజనాలు తయారు చేయించి పెడుతుండేవారు. ఈ పనుల కోసం ఆయా రోజుల్లో ఇతర దేవస్థానాల వంట సిబ్బందిని కూడా డిప్యుటేషన్‌పై తీసుకువచ్చేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024లో ఈ పద్ధతి మార్చారు. రాజకీయ నాయకులు కల్పించుకొని వంటలు చేసే ఓ కేటరింగ్ సంస్థకు ఆ బాధ్యత అప్పగించారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా కనిపించడంతో 2025లో అప్పటి ఈఓ కేటరింగ్ విధానాన్ని వ్యతిరేకించి పాత పద్ధతిలోనే అన్నదాన సత్రంలో వంటలు చేయించి భోజనాలు పెట్టారు. అయితే అవి బాగా లేవని కొందరు అభ్యంతరాలు లేవనెత్తి ఈసారి మళ్లీ కేటరింగ్‌కే ఇవ్వాలని ఒత్తిడి పెట్టారు. దాంతో అంతా కూడబలుక్కొని ‘రుచిగా విందు’ భోజనాలు పెట్టే ఒక సంస్థకు బాధ్యత అప్పగించారు. ఉదయం టిఫిన్‌గా రెండు ఇడ్లీ, రెండు వడ, ఉప్మా 150 గ్రాములు, కాఫీ/టీ, అర లీటరు వాటర్ బాటిల్ చొప్పున ఇవ్వాలని, దానికి రూ.125 ధర నిర్ణయించారు. మద్యాహ్నం, రాత్రికి భోజనం పెట్టాలని, అందులో వెజ్ పలావ్, స్వీటు, వెజ్ కర్రీ, వెజ్ ఫ్రై, పప్పు, అన్నం, సాంబారు, రోటి పచ్చడి, ఆవకాయ, అర లీటరు వాటర్ బాటిల్‌కు రూ.195 రేటు నిర్ణయించారు. ఎంతమంది విధుల్లో ఉంటే అంత మందికి సరఫరా చేయాలని కాంట్రాక్టు ఇచ్చారు. మాధవధారలో ఉండే ఈ కేటరింగ్ సంస్థ సింహగిరిపై క్యాంటీన్ నిర్వహిస్తోంది. వారు గిరి ప్రదక్షిణ సందర్భంగా సిబ్బంది భోజనాలకు అయిన ఖర్చు అంటూ రూ.83.83 లక్షలకు బిల్లు పెట్టారు. అందులో ఐదు శాతం జీఎస్‌టీ కూడా ఉంది. గతంలో భోజనాలకు ఎన్నడూ ఇంత బిల్లు కాలేదని దేవస్థానంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బందికి అయిన ఖర్చు మాత్రమే. ఇది కాకుండా కొండ, పరిసర ప్రాంతాల్లో ఎస్‌ఐ, ఆపై అధికారులు అందరికీ ప్రత్యేకంగా మళ్లీ భోజనాలు చేయించారు. అది ప్లేటుకు రూ.390 బిల్లు చేశారు. ఆ మొత్తం వివరాలు గుట్టుగా ఉంచారు.
ఇవీ లెక్కలు
గిరి ప్రదక్షిణకు పోలీసులు 1,800 మంది, జీవీఎంసీ నుంచి రెండు వేల మంది, దేవస్థానం సిబ్బంది, వలంటీర్లు అంతా కలిపి మరో 1,200 విధులు నిర్వహించారు. అంటే మొత్తం ఐదు వేల మంది. గిరి ప్రదక్షిణ 27వ తేదీ సాయంత్రం మొదలైంది. ఆ రోజు మధ్యాహ్నానికే అంతా విధులకు వచ్చారు కాబట్టి తొలిరోజు మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెట్టినట్టు లెక్క. దీనికి ఐదు వేల మందికి రూ.195 చొప్పున అయిన వ్యయం రూ.19.5 లక్షలు. గిరి ప్రదక్షిణ రోజు ఉదయం టిఫిన్, రెండు పూటలా భోజనం ఖర్చు రూ.25.75 లక్షలు. మరుసటిరోజు కేవలం గుడి వద్ద డ్యూటీ చేసిన వారికే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు పెట్టారు. అంటే వారు సుమారు వేయి మంది ఉంటారు. వీరి వ్యయం రూ.3.2 లక్షలు. మొత్తం చూసుకుంటే 48.45 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు బిల్లు రూ.83.83 లక్షలు పెట్టగా అందులో రూ.79 లక్షలు చెల్లించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇలా అడ్డగోలుగా పెట్టిన బిల్లులో వచ్చిన లాభాన్ని ముగ్గురు పంచుకున్నట్టు సమాచారం. ఈ కాంట్రాక్టులో మరో ఇద్దరికి భాగస్వామ్యం కల్పించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ చేయించాలి. రాబోయే రోజుల్లో గతంలో మాదిరిగానే అన్నదానం సిబ్బందితో వంటలు చేయించేలా చూడాల్సి ఉంది.