Share News

నాడు భయం.. నేడు ప్రియం!

ABN , Publish Date - Jul 19 , 2026 | 01:41 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టింగ్‌ల తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో నగరంలో పనిచేయడానికి భయపడి రేంజ్‌కు వెళ్లిపోయేందుకు యత్నించిన వారంతా ఇప్పుడు నగరంలో పోస్టింగ్‌ల కోసం పోటీపడుతున్నారు. మరోవైపు గతంలో ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకున్నా పోస్టింగ్‌ల్లో వాటి ప్రభావం కనిపించేది కాదు. తాజాగా సిఫారసు లేకపోతే పోస్టింగ్‌ దక్కే పరిస్థితే లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజా ప్రతినిధుల చుట్టూ సీఐలు ప్రదక్షిణలు చేస్తున్నారని పోలీస్‌ శాఖలోని వారే చెబుతున్నారు.

నాడు భయం..  నేడు ప్రియం!

రెండేళ్ల క్రితం సిటీకి

వచ్చేందుకు వెనుకాడిన సీఐలు

ఇక్కడున్నవారే రేంజ్‌కు వెళ్లేందుకు యత్నం

ప్రస్తుతం మారిన తీరు

నగరంలో పోస్టింగ్‌ కోసం

ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ

గతంలో సిఫారసు లేఖలు లెక్కచేయని సీపీ

ఇప్పుడు లేఖ లేనిదే పోస్టింగ్‌ రావడం లేదనే ప్రచారం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పోలీస్‌ కమిషనరేట్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టింగ్‌ల తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో నగరంలో పనిచేయడానికి భయపడి రేంజ్‌కు వెళ్లిపోయేందుకు యత్నించిన వారంతా ఇప్పుడు నగరంలో పోస్టింగ్‌ల కోసం పోటీపడుతున్నారు. మరోవైపు గతంలో ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకున్నా పోస్టింగ్‌ల్లో వాటి ప్రభావం కనిపించేది కాదు. తాజాగా సిఫారసు లేకపోతే పోస్టింగ్‌ దక్కే పరిస్థితే లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజా ప్రతినిధుల చుట్టూ సీఐలు ప్రదక్షిణలు చేస్తున్నారని పోలీస్‌ శాఖలోని వారే చెబుతున్నారు.

ఏ ప్రభుత్వ శాఖలోనైనా నగరంలో పోస్టింగ్‌ అంటే తీవ్రమైన పోటీ నెలకొంటుంది. ఇది పోలీస్‌ శాఖలో మరింత అధికం. విద్యా సంస్థలు, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడమే అందుకు కారణం. వీటితోపాటు భారీగా సంపాదించుకునే అవకాశం ఉంటుం దనే ఎక్కువ మంది సీఐలు నగరంలో పోస్టింగ్‌ కోసం పోటీపడుతుంటారు. నగరంలో పనిచేస్తున్నవారు తమ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు, రేంజ్‌లో పనిచేసేవారు నగరానికి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తుంటారు.

గతంలో కఠినంగా...

రెండేళ్ల కిందట సీపీగా శంఖబ్రతబాగ్చి బాధ్యతలు స్వీకరించినప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది. నగరానికి వచ్చేందుకు యత్నించిన వారంతా వెనక్కి తగ్గారు. ఇక్కడ పనిచేస్తున్న వారు రేంజ్‌కు వెళ్లేందుకు క్యూ కట్టారు. సీపీ అత్యంత కఠినంగా ఉంటారని, విధి నిర్వహణలో పొరపాటు, నిర్లక్ష్యం, అవినీతిని సహించరనే భావనే అందుకు కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రారంభంలో సీఐల పోస్టింగ్స్‌లో సీపీ తన మార్కు చూపించారు. ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పంపినా, పట్టించుకోకుండా సమర్థులు, నిజాయితీగా పనిచేస్తారనే ట్రాక్‌ రికార్డు ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇచ్చారు.

మారిన వైఖరిపై చర్చ

ప్రస్తుతం నగరంలో సీఐలకు పోస్టింగ్‌ల విషయంలో అధికారుల ఆలోచన మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రేంజ్‌కు వెళ్లిపోయిన వారంతా ఇప్పుడు నగరంలో పోస్టింగ్‌కు ఆరాటపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి సహకరించాలని కోరుతున్నారు. నగరంలో ఒక పోలీస్‌ స్టేషన్‌లో దాదాపు ఏడాది, రెండేళ్ల సర్వీసు పూర్తిచేసినవారు కీలకమైన స్టేషన్‌లో పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గతంలో ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో సంబంధం లేకుండా పోస్టింగ్‌లు ఇవ్వగా, ఇప్పుడు సిఫారసులేఖ ఉంటేనే పోస్టింగ్‌ లభిస్తోందనే ప్రచారం జరుగుతోంది. తాము కోరినవారికి పోస్టింగ్‌ ఇచ్చుకోలేని పరిస్థితి ఉంటే ప్రజల్లోకి ఎలా వెళ్లగలమని కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయడం వల్లనే పోలీస్‌ ఉన్నతాధికారి వైఖరి మారిందని చెబుతున్నారు. అయితే...అలా సిఫారసులతో పోస్టింగ్‌లు దక్కించుకున్నవారు విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినట్టు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోవడానికి సీపీ సాహసించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో విధి నిర్వహణలో అలసత్వం వహించేవారిపై కఠిన చర్యలు తీసుకున్న ఉన్నతాధికారి ప్రస్తుతం దూకుడు తగ్గించడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Jul 19 , 2026 | 01:41 AM