రబీకి సానుకూలమే!
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:37 AM
ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ ఆరంభమైంది. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా ఖరీఫ్ సీజన్‌లో కీలకమైన జూన్ నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 50 శాతానికిపైగా లోటు వర్షపాతం నమోదైంది.
గత నెలలో కురిసిన వర్షాలతో ప్రయోజనం
స్వల్పకాలంలో పంటచేతికి వచ్చే రకాలను సాగు చేసుకోవాలి
నేలలో పదున్నప్పుడే విత్తుకోవడం మంచిది
వచ్చే నెలలో పంటలకు అనుకూల వాతావరణం
అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గౌరి
అనకాపల్లి అగ్రికల్చర్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ ఆరంభమైంది. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా ఖరీఫ్ సీజన్‌లో కీలకమైన జూన్ నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 50 శాతానికిపైగా లోటు వర్షపాతం నమోదైంది. అయితే సెప్టెంబరు మూడో వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో జూన్ నుంచి సెప్టెంబరు వరకు లోటు వర్షపాతం 20 శాతానికి తగ్గింది. గత నెలలో కురిసిన వర్షాలను వినియోగించుకొని రబీగా అపరాల పంటలు సాగు చేసుకోవాలని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ గౌరి సూచిస్తున్నారు. ఖరీఫ్‌లో తీవ్రవర్షాభావ పరిస్థితులు, సెప్టెంబరులో కురిసిన వర్షాలతో రబీలో సాగు చేయదగిన పంటలకు సంబంధించి ఆమె వెల్లడించిన వివరాలు..
ఎల్‌నినో ప్రభావం జిల్లాలో ఖరీఫ్ పంటల సాగును తీవ్రంగా దెబ్బతీసింది. సెప్టెంబర్ చివరి వారంలో కురిసిన వర్షాలతో ఖరీఫ్ పంటలకు కొంత మేలు జరిగినప్పటికీ... వరి విస్తీర్ణం మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సెప్టెంబరులో కురిసిన వర్షాలతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలతో రబీ పంటలను సాగు చేసుకోవచ్చు. కానీ అక్టోబరు రెండో వారం వచ్చినప్పటికీ ఇంకా ఎండ తీవ్రత కొనసాగుతూ, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. దీంతో భూమిలో తేమ త్వరగా తగ్గిపోతున్నది. రైతులు వెంటనే పొలాలను దున్నుకోవడం ద్వారా తేమను కాపాడుకొని, సత్వరమే విత్తనాలు వేసుకోవాలి. రాగల మూడు నెలల వరకు నీటి సదుపాయం వుండే భూముల్లో వరి సాగు చేయవచ్చు. మిగిలిన లోతట్టు భూముల్లో మొక్కజొన్న, రాగి, జొన్న, ఉలవ, శనగ, అలసంద, మినుము, పెసర, నువ్వు, జనుము పంటలు వేసుకోవచ్చు. వచ్చే నెలలో శీతాకాలం మొదలవుతుంది, ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం వుంది. కాబట్టి చల్లని వాతావరణంతోపాటు వర్షాలు కూడా పంటలను ఆదుకుంటాయి. డిసెంబరు రెండు, మూడు వారాలకల్లా పంట చేతికి వస్తుంది. రైతు సేవా కేంద్రాల్లో ప్రభుత్వం 80 శాతం రాయితీపై రాగి, జనుము, ఉలవ విత్తనాలను అందజేస్తున్నది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లాకు అనుకూలమైన రకాలుః
వరి: ఎన్‌ఎల్‌ఆర్ 3449, ఎంటీయూ 1064, 1061,1121, ఆర్‌ఎన్‌ఆర్ 15048
రాగి: వేగవతి, ఇంద్రావతి, శ్రీచైతన్య
మినుము: ఎల్‌బీజీ 904, టీబీజీ 127, 884, 104, పీయూ 31, 9బీజీ-1
ఉలవ: ఏటీపీ11, వీజడ్‌ఎం1
అలసంద: అర్క సమంది, మంగళ, అర్జున్,
వేరుశనగ: టీజీసీఎస్ 1694, కే6
నువ్వు: వైఎల్‌ఎం 66, 146
మొక్కజొన్న: ప్రైవేటు హైబ్రిడ్ రకాలు
జనుము: ఎస్‌హెచ్-4, సువిన్