ఘోర ప్రమాదం
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:17 AM
హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలో మహాశివరాత్రి ఉత్సవాలకు వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు మృతిచెందారు.
అదుపుతప్పి గోడను ఢీకొన్న ద్విచక్ర వాహనం
ముగ్గురు యువకులు మృతి
మత్స్యగుండం ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా వంతాలగుమ్మి వద్ద ఘటన
పాడేరు రూరల్, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): హుకుంపేట మండలం మఠం పంచాయతీ మత్స్యగుండంలో మహాశివరాత్రి ఉత్సవాలకు వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు మృతిచెందారు. దీనికి సంబంధించి సీఐ డి.దీనబంధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు మండలం ఐనాడ పంచాయతీ గేదెలపాడు గ్రామానికి చెందిన గెమ్మెలి రమేశ్ (25) తాపీమేస్త్రిగా పనిచేస్తూ పాడేరులో నివాసముంటున్నాడు. అలాగే హుకుంపేట మండలం రాప పంచాయతీ గొందిరాప గ్రామానికి చెందిన రేగం సూర్యప్రకాశ్ (20) పాడేరులోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ముల్లుమెట్ట గ్రామానికి చెందిన సీదరి పౌలు (18) పాడేరులోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వీరంతా ద్విచక్ర వాహనంపై సోమవారం సాయంత్రం పాడేరు నుంచి మత్స్యగుండంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలకు వెళ్లారు. రాత్రి ఒంటి గంటకు తిరిగి పాడేరు వస్తున్న సమయంలో పాడేరు మండలం గుత్తులపుట్టు పంచాయతీ వంతాలగుమ్మి గ్రామ సమీపంలో మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒక ఇంటి ప్రహరీ గోడను బలంగా ఢీకొంది. దీంతో సూర్యప్రకాశ్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు మిగతా ఇద్దరినీ 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సీదరి పౌలు మృతిచెందాడు. ఆస్పత్రికి చేరిన తరువాత గెమ్మెలి రమేశ్ మృతిచెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మంగళవారం మధ్యాహ్నం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ తెలిపారు.
మూడు గ్రామాల్లో విషాద ఛాయలు
కూలీ పని చేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్న గెమ్మెలి రమేశ్‌తో పాటు విద్యార్థులు సూర్యప్రకాశ్, పౌలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మూడు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సూర్యప్రకాశ్, పౌలు తల్లిదండ్రులు కూలి పనిచేస్తూ తమ పిల్లలను పాడేరులోని ప్రైవేటు కళాశాలలో చదివిస్తున్నారు. చేతికి అంది వస్తారనుకున్న పిల్లలు మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.