‘సర్’ను వేగవంతం చేయండి
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:59 AM
‘సర్’ను వేగవంతం చేయండి
ఓటరు గుర్తింపు కార్డు ఫొటోల డిజిటలైజేషన్ త్వరగా పూర్తి కావాలి
బీఎల్‌వోలు, ఏఈఆర్‌ఓలకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, నిర్దేశిత గడువులోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఈఆర్‌ఓలను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. గురువారం ఉదయం ‘సర్’ కార్యక్రమంపై కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు, సహాయ ఓటరు నమోదు అధికారులు ‘సర్’ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల నుంచి స్వీకరించిన ఎన్యూమరేషన్ ఫారాల్లో కచ్చితంగా ఓటరు ఫొటో వుండేలా చూడాని, ఓటరు గుర్తింపు కార్డు ఫొటోల డిజిటలైజేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని, దీనికి సంబంధించిన డేటాను ఏఈఆర్‌ఓలు సమర్పించాలన్నారు. ఓటరు జాబితా సవరణ అనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రక్రియ అయినందున అధికారులు, సిబ్బంది ఎటువంటి అలసత్వం వహించకుండా బాధ్యతాయుతంగా పనిచేసి వంద శాతం లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఈఆర్‌వోలు, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ వాసు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.