Share News

శరవేగంగా పనులు

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:43 AM

విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం నక్కపల్లి మండలంలో సేకరించిన భూముల్లో ప్రైవేటు స్టీల్‌ ప్లాంట్‌, బల్క్‌డ్రగ్‌ పార్కుకు మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్టీల్‌ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలైన ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ కంపెనీలు ఇక్కడ సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయంతో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీకి కేటాయించిన భూముల్లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, విద్యుత్‌ లైన్లఏర్పాటు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

శరవేగంగా పనులు
బోయపాడు వద్ద 2,700 కేఎల్‌ సామర్థ్యంతో నిర్మిస్తున్న గల ఓవర్‌హెడ్‌ ట్యాంకు

కారిడార్‌ భూముల్లో మౌలిక వసతులు

వంద అడుగుల వెడల్పుతో తారు రోడ్లు, డ్రైనేజీలు

చివరి దశలో ఏపీఐఐసీ అడ్మిన్‌ భవనం

2,700 కేఎల్‌ సామర్థ్యంతో ఓవర్‌హెడ్‌ ట్యాంకు

ఏలేరు కాలువ నుంచి నీటిని సరఫరాకు భారీ పైపులైన్‌

ప్రైవేటు స్టీల్‌ ప్లాంటుకు అతి త్వరలో శంకుస్థాపన?

నక్కపల్లి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం నక్కపల్లి మండలంలో సేకరించిన భూముల్లో ప్రైవేటు స్టీల్‌ ప్లాంట్‌, బల్క్‌డ్రగ్‌ పార్కుకు మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్టీల్‌ ఉత్పత్తిలో దిగ్గజ సంస్థలైన ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ కంపెనీలు ఇక్కడ సుమారు లక్షన్నర కోట్ల రూపాయల వ్యయంతో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ కంపెనీకి కేటాయించిన భూముల్లో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, విద్యుత్‌ లైన్లఏర్పాటు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.

విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం నక్కపల్లి మండలంలో సేకరించిన సుమారు 4,500 ఎకరాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటుకానున్న విషయం తెలిసిందే. ఇందులో బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్‌పురం, రాజయ్యపేట, వేంపాడు తదితర గ్రామాల పరిధిలో 2,164.31 ఎకరాల భూములను ప్రభుత్వం ‘ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కార్పొరేషన్‌’కు కేటాయించింది. బల్క్‌డ్రగ్‌ పార్కుకు సుమారు 1,500 ఎకరాలు కేటాయించింది. ఈ రెండింటికి కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజయ్యపేట నుంచి బోయపాడు మీదుగా సుమారు 100 అడుగుల వెడల్పుతో బీటీ రహదారి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 15.52 కి.మీ. నుంచి 16.2 కి.మీ. వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రెండు కిలోమీటర్ల మేర డ్రైనేజీ కాలువల నిర్మాణం కూడా పూర్తయ్యింది. ఏపీఐఐసీ పరిపాలన భవనం నిర్మాణ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. 2,700 కేఎల్‌ సామర్థ్యగల ఓవర్‌హెడ్‌ ట్యాంకు పనులు 80 శాతం, బోయపాడు, రాజయ్యపేట గ్రామాలకు ఆనుకుని పైప్‌లైన్‌ నిర్మాణ పనులు 75 శాతం మేర పూర్తి చేశారు. స్టీల్‌ప్లాంట్‌ అవసరాల కోసం నాతవరం మండలం ఎంబీపట్నం వద్ద ఏలేరు కాలువ నుంచి నీటిని సరఫరా చేసేందుకు 1100 మి.మీ. వ్యాసార్థగల పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ముడిసరుకు రవాణా, వాహనాల రాకపోకలకు, స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి నీటి వనరుల సమీకరణ తదితర విభాగాలకు సంబంధించి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే ‘ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కార్పొరేషన్‌’ ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులకు అతిత్వరలోనే శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరవుతారని అధికార పార్టీ వర్గాల చెబుతున్నాయి.

Updated Date - Feb 11 , 2026 | 12:43 AM