డిజిటల్ హెల్త్ రికార్డులతో వేగంగా వైద్యం
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:51 AM
ఆస్పత్రుల్లో డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజలకు వేగంగా వైద్య సేవలు అందుతాయని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
జిల్లా కలెక్టర్ టి.నిషాంతి
పాడేరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజలకు వేగంగా వైద్య సేవలు అందుతాయని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రిని సోమవారం ఉదయం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న రోగులతో మాట్లాడారు. కొందరి డిజిటల్ ఐడీలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ ఆస్పత్రులకు వచ్చే ప్రతి వారు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ డిజిటల్ ఐడీని పొందడం ద్వారా సంపూర్ణ వైద్య సమాచారం డిజిటల్ రూపంలో సురక్షితంగా భద్రపరచుకోచ్చునన్నారు. ఈ ఐడీలతో ఎక్కడైనా త్వరితగతిన వైద్య సేవలు పొందేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆస్పత్రులకు వచ్చే ప్రతి ఒక్కరూ విధిగా అభా ఐడీని పొందాలన్నారు. ఈ ఐడీ మారుమూల ప్రాంతాలకు చెందిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, తమ వైద్య పరీక్షలు, ఇతర వివరాలను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఆస్పత్రులకు వచ్చిన రోగులకు సేవాభావంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు. రోగులతో మాట్లాడి ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆధునిక టెస్ట్ ల్యాబ్ ప్రారంభం
జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక టెస్ట్ ట్యాబ్‌ను జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈల్యాబ్ ద్వారా ఒకేసారు 50 మంది రోగులకు సంబంధించిన నమూనాలను పరీక్షించవచ్చునన్నారు. దశల వారీగా జిల్లా ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్‌ఎంవో డాక్టర్ ఎర్రయ్య, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.