అర్జీల పరిష్కారం మరింత వేగవంతం
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:41 PM
మీకోసం కార్యక్రమానికి వచ్చిన అర్జీల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశం
ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్‌లో 95 వినతుల స్వీకరణ
పాడేరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): మీకోసం కార్యక్రమానికి వచ్చిన అర్జీల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి మండల కేంద్రంలో ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పక్కాగా పరిశీలించి అర్జీదారులకు సంపూర్ణంగా న్యాయం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారానికి గాను ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించాలన్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. గడువులోగా అర్జీలను పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. గ్రామ, పంచాయతీ, మండల స్థాయిల్లోని సమస్యలను ఆయా స్థాయిలోనే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో జిల్లా, డివిజన్ స్థాయి సమస్యలపై మాత్రమే అర్జీలు వచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్‌వో పి.అంబేడ్కర్ ప్రజల నుంచి 95 వినతులను స్వీకరించారు. అలాగే అక్కడే నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో 30 సమస్యలపై అర్జీలు అందాయి.
1100 కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి
మీకోసం కార్యక్రమంలో అర్జీలు ఇచ్చినా సమస్యలు పరిష్కారానికి నోచుకోకుంటే 1100 నంబర్‌కు ఫోన్ చేసి సేవలు పొందాలని అర్జీదారులకు కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సమస్యలు, వీధి దీపాలు, డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలపైనా టోల్ ఫ్రీ నంబర్: 1100 కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ వి.మురళి, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ కృష్ణమూర్తినాయక్, జిల్లా విద్యాశాఖాధికారి కె.రామకృష్ణారావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, జిల్లా ఉద్యానవనాధికారి కె.బాలకర్ణ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, ఐసీడీఎస్ పీడీ సీహెచ్.ఝాన్సీబాయి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, స్వర్ణ గ్రామ శాఖ జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్, జిల్లా పరిశ్రమల శాఖాధికారి రమణారావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్ , జాతీయ రహదారుల డీటీ వి.ధర్మరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.