Share News

పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు

ABN , Publish Date - Feb 13 , 2026 | 01:04 AM

జిల్లాలో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలు, పారిశ్రామిక అనుమతులు, ఏర్పాటు చేసిన యూనిట్లకు అందించాల్సిన ప్రోత్సాహకాలు, తదితర అంశాలపై సమీక్షించారు.

పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

పెండింగ్‌ దరఖాస్తులను సత్వరమే క్లియర్‌ చేయాలి

మౌలిక సదుపాయాల కల్పన, రుణాల మంజూరుకు తోడ్పాటు

పరవాడ మండలంలో బొగ్గు కాలుష్యంపై విచారణ

అధికారులకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశం

అనకాపల్లి, పిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలు, పారిశ్రామిక అనుమతులు, ఏర్పాటు చేసిన యూనిట్లకు అందించాల్సిన ప్రోత్సాహకాలు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పారిశ్రామిక అనుమతుల కోసం సింగిల్‌ డెస్క్‌ పాలసీలో వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో వున్న దరఖాస్తులపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పరిశ్రమలు స్థాపనకు అందిన దరఖాస్తులు పరిశీలించి అర్హత, ఆసక్తిగల వారికి వెంటనే అనుమతులు జారీచేసి, అవసరమైన మేర మౌలిక సదుపాయాలు కల్పించాలని స్పష్టంచేశారు. అవసరమైతే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణ సదుపాయం కల్పించేందుకు సహకారం అందించాలని సూచించారు. అనుమతులు మంజూరు చేసిన యూనిట్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి, ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు.

బొగ్గు కాలుష్యంపై విచారణ జరపాలి...

పరవాడ మండలంలో నోటిఫైడ్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ ఏరియాలో అవసరమైన అనుమతులు పొందకుండానే బొగ్గు ప్రాసెసింగ్‌, హ్యాండ్లింగ్‌ చేస్తూ కాలుష్యానికి కారణమవుతున్న మెస్సెర్స్‌ ఎస్‌.సుధాకర్‌, మెస్సెర్స్‌ వేదప్రియ రిసోర్సెస్‌ పరిశ్రమలపై విచారణ జరపాలని కలెక్టర్‌ ఆదేశించారు. విచారణ అనంతరం పర్యావరణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖల అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ పీకేపీ ప్రసాద్‌, ఎల్‌డీఎం సత్యనారాయణ, కమిటీ సభ్యులు, మైనింగ్‌, విద్యుత్‌, జీఎస్టీ, ఏపీఐఐసీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 01:04 AM