Share News

వేగంగా వారధి పనులు

ABN , Publish Date - May 21 , 2026 | 01:09 AM

మండలంలో వరహా నదిపై పందూరు వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. వర్షాలు మొదలై, నదిలో వరద ప్రవాహం పెరిగేనాటికి వంతెన అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో 14 ఏళ్ల నుంచి ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు పడుతున్న ఇక్కట్లు తొలగిపోతాయి.

వేగంగా వారధి పనులు
వంతెన పిల్లర్లపై పూర్తయిన శ్లాబ్‌ పనులు

పందూరు వంతెన శ్లాబ్‌, ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పూర్తి

చురుగ్గా సాగుతున్న అప్రోచ్‌ రోడ్ల పనులు

రెండు నెలల్లో అందుబాటులోకి వంతెన

కోటవురట్ల, మే 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో వరహా నదిపై పందూరు వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు శరవేగంగా సాగుతున్నాయి. వర్షాలు మొదలై, నదిలో వరద ప్రవాహం పెరిగేనాటికి వంతెన అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో 14 ఏళ్ల నుంచి ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు పడుతున్న ఇక్కట్లు తొలగిపోతాయి.

వరహా నదికి 2012 నవంబరులో భారీగా వరద పోటెత్తడంతో పందూరు వద్ద వంతెన కొట్టుకుపోయింది. దీంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ కొత్త వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర విభజనకు ముందు 2013లో రూ.6 కోట్లు మంజూరయ్యాయి. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత 2014 ఏప్రిల్‌లో కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ జరిగింది. 2015 మార్చి 5నఅప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2017 డిసెంబరునాటికి శ్లాబ్‌ మినహా మిగిలిన పనులు పూర్తయ్యాయి. నిధులు మంజూరు అయ్యేనాటికి వున్న ధరలతో పోలిస్తే నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరగడంతో ప్రభుత్వం కేటాయించిన రూ.6 కోట్లతో ఇంతవరకే పనులు అయ్యాయంటూ కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. అధికారులు మళ్లీ అంచనాలు తయారు చేసి రూ.3 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తరువాత 2018 అక్టోబరుతో కాంట్రాక్టు గడువు ముగియడం, మరుసటి ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ (ఉపాధ్యాయ) ఎన్నికల కోడ్‌, మార్చిలో సాధారణ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు మిగిలిన అభివృద్ధి పనుల మాదిరిగానే పందూరు వంతెనను కూడా అటకెక్కించారు. అప్పటి నుంచి ఏటా ప్రతిపాదనలు పంపడం, రాజధాని స్థాయిలో బుట్టదాఖలు చేయడం ఆనవాయితీగా మారింది.

రెండేళ్ల క్రితం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోం మంత్రి అయ్యారు. ఆమె ప్రత్యేక శ్రద్ధ వహించి పందూరు వంతెన పనులకు ప్రభుత్వం నుంచి రూ.5.75 కోట్లు మంజూరు చేయించారు. గత ఏడాది ఏప్రిల్‌లో పనులు పునఃప్రారంభం అయ్యాయి. అంతకుముందు నదిలో పిల్లర్ల వరకు పనులు పూర్తికాగా, వాటిపై శ్లాబ్‌ నిర్మాణ పనులు చేపట్టారు. గత ఏడాది వర్షాకాలంలో ఎక్కువ రోజులు నదిలో వరద ప్రవాహం వుండడంతో పనులు మందగించాయి. డిసెంబరు నుంచి మళ్లీ ఊపందుకున్నాయి. పిల్లర్లపై శ్లాబ్‌ నిర్మాణం, ఒకవైపు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మరోవైపు రిటైనింగ్‌ వాల్‌, ఇరువైపులా అప్రోచ్‌ రోడ్డు పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్‌కు ఈ ఏడాది అక్టోబరు వరకు గడువు వుందని, అయినప్పటికీ జూలై నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తిచేసి వంతెనను అందుబాటులోకి తెస్తామని ప్రాజెక్టు ఏఈ సత్యనారాయణ తెలిపారు.

Updated Date - May 21 , 2026 | 01:09 AM