Share News

రైతుబజారు రెడీ

ABN , Publish Date - May 01 , 2026 | 02:19 AM

స్థానిక ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో అసంపూర్తిగా నిలిచిపోయిన రైతుబజారు పనులు ఎట్టకేలకు పునఃప్రారంభమయ్యాయి.

రైతుబజారు రెడీ

తుది దశలో విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్ల పనులు

రెండు, మూడు రోజుల్లో పూర్తి

అతి త్వరలోనే ప్రారంభం

వందకుపైగా స్టాల్స్‌

రైతులకు 72, డ్వాక్రాలకు 25, దివ్యాంగులకు మూడు

లాటరీ విధానంలో కేటాయింపు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి):

స్థానిక ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో అసంపూర్తిగా నిలిచిపోయిన రైతుబజారు పనులు ఎట్టకేలకు పునఃప్రారంభమయ్యాయి. విద్యుత్‌ సదుపాయం, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర పనులు జోరుగా సాగుతున్నాయి. రైతుబజారులో వంద వరకు దుకాణాలు వుంటాయి. వీటిలో 72 దుకాణాలను రైతులకు, 25 దుకాణాలను డ్వాక్రా సంఘాలకు, మూడింటిని దివ్యాంగులకు కేటాయించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రారంభోత్సవ తేదీని త్వరలో ఖారారు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అనకాపల్లికి రైతుబజారు మంజూరు చేసినప్పటికీ దానిని ఏర్పాటు చేయడంలో అప్పటి పాలకులు శ్రద్ధ చూలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆర్డీవో షేక్‌ ఆయీషాలు రైతుబజారు ఏర్పాటు కోసం ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో ఖాళీగా ఉన్న బ్లాకులను పరిశీలించారు. నాగదుర్గమ్మ ఆలయానికి ఎదురుగా చాలా కాలం నుంచి నిరుపయోగంగా ఉన్న 17, 18 బ్లాకుల్లో రైతుబజారు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిన రూ.14.5 లక్షలతో గత ఏడాది డిసెంబరులో అభివృద్ధి పనులు చేపట్టారు. నిధులు చాలకపోవడంతో విద్యుద్దీకరణ, ఇతర పనులు చేపట్టలేదు. ప్రభుత్వం మళ్లీ నిధులు మంజూరు చేయడంతో విద్యుత్‌ వైరింగ్‌, ఆర్వో ప్లాంట్‌కు రూ.9.5 లక్షలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.12.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వందకుపైగా స్టాల్స్‌ (దుకాణాలు) సిద్ధం చేశారు. వీటిలో 25 స్టాల్స్‌ డ్వాక్రా సంఘాలకు, మూడు స్టాల్స్‌ దివ్యాంగులకు, మిగిలిన 72 స్టాల్స్‌ రైతులకు కేటాయించనున్నారు. అయితే రైతుబజారులో స్టాల్స్‌ మంజూరు కోసం చట్టుపక్కల మండలాలకు చెందిన 150 రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి లాటరీ స్టాల్స్‌ను కేటాయిస్తారు.

త్వరలో రైతుబజారు ప్రారంభం

అశోక్‌కుమార్‌, మార్కెటింగ్‌ శాఖ ఏడీ

ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డులో రైతుబజారు ఏర్పాటు పనులు యుద్ధప్రాతిపదిక జరుగుతున్నాయి. గురువారం విద్యుద్దీకరణ పనులు ప్రారంభించాం. రెండు రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయి. తాగునీరు, మరుగుదొడ్ల పనులు కూడా చివరి దశలో వున్నాయి. ఇవన్నీ రెండు, మూడు రోజుల్లో పూర్తవుతాయి. రైతుబజారును ప్రారంభానికి సిద్ధం చేసిన తరువాత ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. వారిచ్చిన తేదీ మేరకు ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటాం.

Updated Date - May 01 , 2026 | 02:19 AM