ఎట్టకేలకు అందుబాటులోకి రైతుబజారు
ABN , Publish Date - May 26 , 2026 | 12:49 AM
అనకాపల్లి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల మండలాల్లో కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుబజారు ఎట్టకేలకు అందుబాటులోకి రానున్నది.
నేడు ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ప్రారంభం
అనకాపల్లి టౌన్, మే 25 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి పట్టణ ప్రజలు, చుట్టుపక్కల మండలాల్లో కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతుబజారు ఎట్టకేలకు అందుబాటులోకి రానున్నది. ఎన్టీఆర్ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన రైతుబజారును మంగళవారం కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
అనకాపల్లికి రైతుబజారు 2022లోనే మంజూరైంది. అయితే అప్పటి పాలకులు దృష్టి సారించకపోవడంతో ఇది ఏర్పాటుకు నోచుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రైతుబజారు ఏర్పాటుపై శ్రద్ధ చూపారు. కలెక్టర్ విజయకృష్ణన్‌తో కలిసి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న బ్లాకులను పరిశీలించారు. వీటిల్లో 17, 18 నంబర్ల బ్లాకులు ఖాళీగా ఉండడంతో రైతుబజారు ఏర్పాటకు అనువుగా మార్కెటింగ్ శాఖ అధికారులు సుమారు వంద దుకాణాలను (స్టాల్స్) నిర్మించారు. రంగులు వేయించి, విద్యుత్ పనులు చేపట్టారు. రైతుబజారులో 72 దుకాణాలను రైతులకు, 25 షాపులను డ్వాక్రా సంఘాలకు, మూడింటిని దివ్యాంగులకు ఇటీవల లాటరీ విధానంలో కేటాయించారు. మంగళవారం కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా రైతుబజారును ప్రారంభించనున్నట్టు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు అశోక్‌కుమార్ తెలిపారు. ఎట్టకేలకు రైతుబజారు అందుబాటులోకి రానుండడంతో పట్టణ వినియోగదారులు, సమీప గ్రామాల్లో కూరగాయ పంటలను సాగు చేసే రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.