వాన జాడ లేక రైతన్న దిగాలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:35 AM
ఎల్‌నినో ప్రభావం మండలంపై స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు కురవకపోవడంతో వరి సాగు విస్తీర్ణం మూడొంతులు పడిపోయింది. వరి నాట్లు వేసే సమయం ముగుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎండిపోతున్న వరినారు
మండలంలో మూడొంతులు తగ్గిపోయిన సాగు విస్తీర్ణం
కొయ్యూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం మండలంపై స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు కురవకపోవడంతో వరి సాగు విస్తీర్ణం మూడొంతులు పడిపోయింది. వరి నాట్లు వేసే సమయం ముగుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏజెన్సీలోని 11 మండలాల్లో ఇక్కడి వాతావరణం భిన్నంగా ఉంటుంది. మైదాన ప్రాంతాలకు దీటుగా అత్యధిక ఉషోగ్రతలు నమోదవుతుంటాయి. దీనికి తోడు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. మండల వ్యాప్తంగా ఖరీఫ్‌లో సాగునీటి వనరులున్న భూములు సుమారు రెండు వేల హెక్టార్లకు పైబడి ఉన్నాయి. చిన్న చెరువులు, వర్షాకాలంలో కొండవాగు ప్రవాహాల ఆధారంగా చెక్‌డ్యామ్‌ల కింద భూములు మరో 2,091 హెక్టార్లు ఉన్నాయి. దీనిలో ఇప్పటి వరకు చెక్‌డ్యామ్, తదితర సాగునీటి వనరులు ఆధారితంగా కొయ్యూరు, బూదరాళ్ళ, చీడిపాలెం, శరభన్నపాలెం, మఠంభీమవరం పంచాయతీల పరిధిలో కేవలం 750 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు వేశారు. వర్షాధారం, చిన్న చెరువులు, ఆయకట్టు కింద గల భూములకు వర్షాభావ ప్రభావంతో సెంటు భూమిలో కూడా వరినాట్లు వేయలేదు. వరి సాగుకు అనుకూలమైన భూములన్నిటికీ సమృద్ధ్దిగా సాగు చేసుకునేందుకు వీలుగా 90 శాతం రాయితీపై 103 టన్నుల వరి విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేయగా, వాటిని నాట్లు వేసేందుకు వీలుగా రైతాంగం నారు పోసినప్పటికి ఇప్పటి వరకు కేవలం 30 టన్నుల విత్తనాలకు సంబంధించిన నారు మాత్రమే వినియోగించారు. మిగిలిన 73 టన్నుల విత్తనాలకు సంబంధించిన నారు మొలకెత్తినా నీరు లేక ఎదగని పరిస్థితి కొన్ని పంచాయతీలలో నెలకొనగా, ఎదిగిన నారు వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతున్న దుస్థితి మరికొన్ని చోట్ల ఉంది. నాట్లు వేసేందుకు ఈ నెలాఖరు వరకు సమయం ఉండడంతో వర్షాలు పడతాయనే ఆశతో రైతులు నారును సంరక్షించుకునే చర్యలు చేపడుతున్నారు ఇప్పటికైనా వర్షాలు కురిస్తే వరికి ప్రత్యామ్నాయంగా నువ్వులు, మినుముల పంటలు వేయాలనే ఆలోచనతో రైతులు ఉన్నారు. అయితే ప్రభుత్వం రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తేనే రైతులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులపై మండల వ్యవసాయ శాఖాధికారి శివరామ ప్రసాద్ వివరణ కోరగా, వరినాట్లు వేసుకునేందుకు ఈ నెలాఖరు వరకు సమయం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా గడువులోపు మండలంలో వర్షాలు కురవకపోతే రైతులు ప్రతాత్యమ్నాయ పంటలు వేసుకునేందుకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. అయితే ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నా కనీస వర్షపాతం ఉండాలని, దానిని పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.