Share News

దళారుల చేతిలో రైతన్న దగా

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:40 AM

దిగుబడి అధికంగా వచ్చినా ప్రభుత్వం మార్కెటింగ్‌ సదుపాయం కల్పించకపోవడంతో దళారుల చేతిలో జీడిమామిడి రైతులు దగా అవుతున్నారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలో రంపచోడవరం నుంచి అనంతగిరి మండలం వరకు సుమారు 70 వేల ఎకరాల్లో జీడిమామిడి సాగవుతోంది. ఈ ప్రాంత వాతావరణం జీడిమామిడి సాగుకు అనుకూలం కావడంతో 65 శాతం మంది రైతులు జీడితోటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

దళారుల చేతిలో రైతన్న దగా
పిందె దశలో ఉన్న జీడిమామిడి

- జీడిమామిడి దిగుబడి అధికంగా వచ్చినా ఫలితం ఉండడం లేదని రైతుల ఆవేదన

- ప్రభుత్వం మార్కెటింగ్‌ సదుపాయం కల్పించకపోవడంతో మధ్యవర్తుల మాయాజాలం

- కుమ్మకై ధర తగ్గించడంతో పాటు తూకంలో మోసాలు

కొయ్యూరు, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): దిగుబడి అధికంగా వచ్చినా ప్రభుత్వం మార్కెటింగ్‌ సదుపాయం కల్పించకపోవడంతో దళారుల చేతిలో జీడిమామిడి రైతులు దగా అవుతున్నారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలో రంపచోడవరం నుంచి అనంతగిరి మండలం వరకు సుమారు 70 వేల ఎకరాల్లో జీడిమామిడి సాగవుతోంది. ఈ ప్రాంత వాతావరణం జీడిమామిడి సాగుకు అనుకూలం కావడంతో 65 శాతం మంది రైతులు జీడితోటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్క కొయ్యూరు మండలంలోనే 28 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రతీ ఏటా వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మండలంలో 50 టన్నుల నుంచి 70 టన్నుల జీడిమామిడి పిక్కల దిగుబడి వస్తుంది. అయితే ప్రభుత్వం మార్కెటింగ్‌ సదుపాయం కల్పించకపోవడంతో దళారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు రైతుల నుంచి జీడిపిక్కలు కొనుగోలు చేస్తున్నారు.

గత ఏడాది జీడిమామిడి పిక్కల సీజన్‌ ఆరంభంలో 80 కిలోల బస్తా ధర రూ.11 వేలు పలికింది. అయితే వర్షాల వల్ల పిక్క నాణ్యత లేదనే సాకుతో దళారులు కుమ్మకై ధరను ఒక్కసారిగా రూ.3 వేలు తగ్గించారు. సీజన్‌ ఆఖరికి బస్తా రూ.7 వేలకు పడిపోయింది. అలాగే 2024లో బస్తా రూ.8 వేలు దాటకుండా కొనుగోలు చేశారు. ధర విషయంలోనే కాకుండా తూకం విషయంలో కూడా రైతులను దళారులు మోసగిస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో దశాబ్దం క్రితం ఐటీడీఏ అధికారులు ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు. అలాగే మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రొసెసింగ్‌ జరిపేలా రావణాపల్లిలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినా అది వినియోగంలో లేకపోవడంతో నిరుపయోగంగా ఉంది. జిల్లాలో కాఫీ, మిరియాలు వంటి పంటలను కొనుగోలు చేస్తున్న జీసీసీ జీడిమామిడి పిక్కల కొనుగోలు విషయంలో ముందడుగు వేయడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జీడిపిక్కల సీజన్‌కు ముందే ప్రొసెసింగ్‌ యూనిట్‌ను తెరిపించాలని, జీసీసీ ద్వారా మండలానికి నాలుగైదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి జీడిపిక్కలు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ వివరణ కోరగా, జీడిమామిడి సాగు చేస్తున్న మండలాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో జీసీసీ, వెలుగు అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చూస్తామని ఆమె తెలిపారు.

Updated Date - Mar 28 , 2026 | 12:40 AM