Share News

పశు బీమాతో రైతుకు ధీమా

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:20 AM

పాడి పరిశ్రమ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. పశువుల బీమా పథకంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం సొమ్ములో సుమారు 85 శాతాన్ని ప్రభుత్వాలు భరిస్తున్నాయి. రైతులు 15 శాతం ప్రీమియం సొమ్ము చెల్లిస్తే సరిపోతుంది.

పశు బీమాతో రైతుకు ధీమా

ప్రీమియం సొమ్ములో 85 శాతం భరిస్తున్న ప్రభుత్వం

రైతులు 15 శాతం చెల్లిస్తే చాలు

ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు వర్తింపు

సద్వినియోగం చేసుకోవాలంటున్న పశుసంవర్ధక శాఖ అధికారులు

నర్సీపట్నం, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): పాడి పరిశ్రమ అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. పశువుల బీమా పథకంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం సొమ్ములో సుమారు 85 శాతాన్ని ప్రభుత్వాలు భరిస్తున్నాయి. రైతులు 15 శాతం ప్రీమియం సొమ్ము చెల్లిస్తే సరిపోతుంది. గతంలో పశువు చనిపోతే బీమా కంపెనీ నుంచి పరిహారం పొందడానికి రైతులు నానాపాట్లు పడేవారు. ఇకపై ఎటువంటి ఇబ్బందులు వుండవు. గేదె లేదా ఆవు చనిపోతే.. దాని ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తే చాలు. పరిహారం సొమ్ము నేరుగా రైతు ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న ఉచిత పశువైద్య శిబిరాల్లో ఆయా పశువులకు బీమా సౌకర్యం కల్పించడానికి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో బీమా చేసిన పశువులకు ఒక నంబరుతో ట్యాగ్‌ వుంటుంది. ఒకవేళ ట్యాగ్‌ లేకపోతే అక్కడికక్కడే పశువుకు ఒక నంబరు కేటాయించి ట్యాగ్‌ వేస్తున్నారు. ఈ ట్యాగ్‌ నంబరు ఆధారంగానే పశువుల బీమా వర్తిస్తుంది.

ఆవులు, గేదెల పోషణ, మేకలు, గొర్రెల పెంపకం ద్వారా ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారు. పశుసంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 1,87,579 ఆవులు, 2,03,524 గేదెలు ఉన్నాయి. వీటిలో 64,321 పాడి/ చూడి ఆవులు, 71,848 చూడి/ పాడి గేదెలు ఉన్నాయి. బీమా పథకం గేదెలు, ఆవులతోపాటు ఆరు నెలలు నిండిన మేకలు, గొర్రెలకు కూడా వర్తిస్తుంది. వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల కారణంగా ఇవి చనిపోతే ఆయా రైతులు, పెంపకందారులు ఆర్థికంగా నష్టపోకుండా వుండేందుకు కూటమి ప్రభుత్వం పశువుల బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. పశువు విలువనుబట్టి చెల్లించాల్సిన ప్రీమియంలో 85 శాతం సొమ్మును ప్రభుత్వం భరిస్తుంది. రూ.30 వేలు విలువ చేసే పశువుకి రూ.1,920 ప్రీమియం. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1,632 (85 శాతం)భరిస్తాయి. మిగిలిన రూ.288లను సంబంధిత రైతు చెల్లిస్తే సరిపోతుంది. దేశవాళీ రకం పశువు విలువ రూ.15 వేలుకాగా దీనికి చెల్లించాల్సిన బీమా ప్రీమియంలో రూ.960లు ప్రభుత్వం భరిస్తుండగా, పశు సంరక్షకులు రూ.144 చెల్లించాలి.. ఆరు నెలలు దాటిన గొర్రెలు, మేకలకు మూడేళ్ల వరకు బీమా చేస్తారు. తొలి ఏడాదికి ఒక్కో జీవం విలువ రూ.6 వేలు కాగా బీమా ప్రీమియం కింద పెంపకందారులు రూ.27 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.153ను ప్రభుత్వం భరిస్తుంది. ఒక్కో రైతుకు గరిష్టంగా 10 ఆవులు/ గేదెలు, 100 మేకాలు/ గొర్రెలకు బీమా వర్తిస్తుందని అధికారులు చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్‌ డబ్ల్యూ రాంబాబు కోరారు.

Updated Date - Jan 23 , 2026 | 12:20 AM