కుటుంబ ప్రోత్సాహం కీలకం
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:42 AM
‘పురుషులతో పోటీ పడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
సినిమా సెట్ చూసి జడ్జి కావాలని న్యాయ విద్యను అభ్యసించా
ఎక్కువ మంది న్యాయవాదులను తయారుచేసేందుకు అవకాశం ఉంటుందని బోధన వైపు వచ్చా
ఇప్పటికీ మహిళలు వివక్షకు గురవుతుండడం బాధాకరం
ప్రతి సవాల్‌కు పరిష్కారం ఉందన్న విషయాన్ని మహిళలు గుర్తించాలి
రక్షణగా అనేక చట్టాలు
‘ఆంధ్రజ్యోతి’తో ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. సీతామాణిక్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘పురుషులతో పోటీ పడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎందులోనైనా రాణించాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా తప్పనిసరి. అప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. నా కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగాను’...అని అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.సీతామాణిక్యం. వర్సిటీలో కీలకమైన న్యాయ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా, గాంధీయన్ స్టడీ సెంటర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె...రాష్ట్రంలో న్యాయ విద్యకు సంబంధించి అత్యున్నతమైన ఎల్‌ఎల్‌డీ (డాక్టర్ ఆఫ్ లా) పూర్తిచేసిన తొలి మహిళగా గుర్తింపుపొందారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమెను పలకరించగా అనేక విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
మాది రావులపాలెం పక్కన ఊబలంక అనే చిన్న గ్రామం. తల్లిదండ్రులు పేర్రెడ్డి, బుల్లి వెంకాయమ్మ. ఎనిమిది మంది సంతానంలో ఏడోదాన్ని. అమ్మాయిలను ఉన్నత చదువులు చదివించాలన్న ఆసక్తి అమ్మా, నాన్నకు పెద్దగా ఉండేది లేదు. నాకు మాత్రం బాగా చదువుకోవాలని ఉండేది. కానీ, ఇంటర్ చదువుతుండగానే 17 ఏళ్లకు పెళ్లి చేసేశారు. చదువుపై నా ఆసక్తిని గుర్తించిన భర్త తమ్మిరెడ్డి, అత్త,మామలు ప్రోత్సహించారు. కానీ, ఎటువైపు వెళ్లాలన్న దానిపై స్పష్టత లేదు. నా భర్త కుటుంబం నాలుగు తరాలుగా సివిల్ ఇంజనీర్స్‌గా పనిచేస్తున్నారు. దాంతో నన్ను కూడా అటువైపు తీసుకువెళ్లాలని ఆయన భావించారు. అదే సమయం (పెళ్లైన కొత్త)లో హైదరాబాద్ వెళ్లినప్పుడు పద్మాలయ స్టూడియోను సందర్శించడం జరిగింది. అక్కడ కోర్టు సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు సెట్ వేశారు. అక్కడ నన్ను మావారు జడ్జి కుర్చీలో కూర్చోబెట్టి ఫొటో తీశారు. జడ్జికి ఉన్న ప్రాధాన్యం, ఎంతోమందికి న్యాయం చేసే అవకాశం ఉంటుందని తెలుసుకుని న్యాయవాద వృత్తిలోకి అడుగు పెట్టాలని భావించాను. డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ పూర్తిచేశాను. ఆ తరువాత న్యాయ విద్యలో అత్యున్నత డిగ్రీగా భావించే ఎల్‌ఎల్‌డీ కూడా చేశాను. రాష్ట్రంలో ఎల్‌ఎల్‌డీ పూర్తిచేసిన మొదటి వ్యక్తిని నేనే. జడ్జిగా కంటే బోధనలో ఉంటే ఎక్కువ మంది న్యాయవాదులను, న్యాయమూర్తులను తయారుచేసేందుకు అవకాశం ఉంటుందని భావించి చదువు పూర్తయిన తరువాత ఏయూకు చెందిన శ్రీకాకుళంలోని పీజీ సెంటర్‌లో 2006లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాను. 2010లో ఏయూ న్యాయ కళాశాలకు వచ్చా. ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాను. గడిచిన ఏడాది నుంచి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. 2023లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు పొందాను. ఒకవైపు న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌గా అంబేడ్కర్ సిద్ధాంతాలు, ఆలోచనలను, మరోవైపు గాంధీయన్ స్టడీ సెంటర్ డైరెక్టర్‌గా పని చేస్తూ ఆయన భావ జాలాన్ని ముందుకు తీసుకువెళ్లే గొప్ప అవకాశం నాకు దక్కింది. నా స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరుకుని న్యాయ సేవలను అందిస్తున్నారు. అది చూసినప్పుడు చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంటుంది.
కుటుంబ ప్రోత్సాహం తప్పనిసరి..
ఏ వృత్తిలో అయినా మహిళలు రాణించాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తప్పనిసరి. ముఖ్యంగా భర్త అండదండలు ఉంటేనే మహిళలు ఉన్నత స్థానాలను చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో మహిళలు అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రతి సవాల్‌కు పరిష్కారం ఉందన్న విషయాన్ని మహిళలు గుర్తించాలి. సమాజం ఎంత పురోగతి సాధిస్తున్నప్పటికీ ఇప్పటికీ మహిళలు వివక్షకు గురవుతుండడం బాధాకరం. మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయి. వాటిపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం.