తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:37 PM
మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది.
పెరుగుతున్న చలి తీవ్రత
వణుకుతున్న గిరిజనం
పాడేరు/ముంచంగిపుట్టు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి):
మన్యంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఎదురుగా వస్తున్న వ్యక్తులు సైతం కన్పించని వాతావరణంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. ఉదయం పది గంటల తర్వాత నుంచి సాధారణ ఎండ వాతావరణం కొనసాగింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత నుంచి చలి ప్రభావం చూపుతున్నది. తాజా వాతావరణం నేపథ్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కొయ్యూరులో శుక్రవారం 18.9, అనంతగిరిలో 17.4, పాడేరులో 17.3, జీకేవీధిలో 17.2, హుకుంపేటలో 16.2, చింతపల్లిలో 15.8, జి.మాడుగులలో 15.5, పెదబయలులో 15.0, ముంచంగిపుట్టులో 14.8, డుంబ్రిగుడలో 14.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వణుకుతున్న జనం
ముంచంగిపుట్టు మండల పరిధిలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం చలి ప్రభావం మరింత ఎక్కువగా కనిపించింది. ఉదయం 10 గంటలైనా మంచు తెరలు వీడలేదు. దీంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. పొగమంచు కురుస్తున్నా వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. ఉదయం వేళ వివిధ పనుల నిమిత్తం బయలుదేరే వారు, విద్యార్థులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలు, వయసు పైబడినవారు, ఆస్మా బాధితుల కష్టాలు వర్ణనాతీతం. మరోవైపు చలి తీవ్రతతో పలువురు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. పలు చోట్ల చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.