అటవీ ఉత్పత్తుల ధరలు పతనం
ABN , Publish Date - Jun 13 , 2026 | 10:10 PM
అల్లూరి జిల్లా హుకుంపేటలో ప్రతి శనివారం జరిగే సంతలో అటవీ ఉత్పత్తుల ధరలు పతనమయ్యాయి.
చీపురు కట్ట రూ.25-30
అడ్డాకులు 60 కేజీలు కావిడి రూ.1,400-1,600
గిట్టుబాటు ధర రాలేదని గిరిజన రైతులు గగ్గోలు
హుకుంపేట, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా హుకుంపేటలో ప్రతి శనివారం జరిగే సంతలో అటవీ ఉత్పత్తుల ధరలు పతనమయ్యాయి. వ్యాపారులు అందరూ ఒకటై ధర తగ్గించి కొనుగోలు చేయడంతో ఆదివాసీ రైతులు గగ్గోలు పెట్టారు. వారపు సంతలో అడ్డాకులు 50-60 కేజీల కావిడి రూ.2,500 నుంచి రూ.మూడు వేలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ వారం 50-60 కేజీల కావిడి రూ.1,400 నుంచి రూ.1,600లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అడ్డాకులను కోడూరు, కె.కోటపాడు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేశారని రైతులు తెలిపారు. జీసీసీ కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారులు మంచి ధరకే కొనుగోలు చేసేవారని వారు తెలిపారు. జీసీసీ అడ్డాకుల కొనుగోలు ఆపివేయడంతో వ్యాపారులు తమ కష్టాన్ని దోచేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కొండ చీపుర్లకు సరైన ధర రావడం లేదని రైతులు వాపోయారు. ఒక చీపురు కట్ట రూ.25 నుంచి రూ.30లకు కొనుగోలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జీసీసీ అధికారులు స్పందించి గతంలో విధంగా అడ్డాకులు, చీపుర్లు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.