వ్యవసాయశాఖకూ పాకిన నకిలీ దందా
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:30 PM
గిరిజన నిరుద్యోగ యువతను ప్రభుత్వ పాఠశాలల్లో నకిలీ ఉత్తర్వులతో వలంటీర్లుగా నియమించిన ప్రైవేటు వ్యక్తుల దందా వ్యవసాయశాఖకూ పాకింది.
ఎన్‌ఎఫ్‌ఏలుగా నియమిస్తూ ఫేక్ ఉత్తర్వులు ఇచ్చిన మోసగాళ్లు
మూడు మండలాల పరిధిలో 30 మందికి టోకరా
ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు
చింతపల్లి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): గిరిజన నిరుద్యోగ యువతను ప్రభుత్వ పాఠశాలల్లో నకిలీ ఉత్తర్వులతో వలంటీర్లుగా నియమించిన ప్రైవేటు వ్యక్తుల దందా వ్యవసాయశాఖకూ పాకింది. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల్లో భారత్ సేవక్ సమాజ్ పేరిట ఎన్‌ఎఫ్‌ఏ(నేచురల్ ఫార్మింగ్ అసిస్టెంట్) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి మండలాల పరిధిలో పదవ తరగతి పైబడి చదివిన విద్యార్థినీ, విద్యార్థులకు నకిలీ ఉత్తర్వులు జారీ చేసి 30 మంది నుంచి రూ.60 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.
గ్రామ సచివాలయాల పరిధిలో వ్యవసాయశాఖకు అనుబంధంగా ఎన్‌ఎఫ్‌ఏలుగా విధులు నిర్వహించాల్సి వుంటుంది, నెలకు రూ.25 వేల జీతం అందుతుందని నిరుద్యోగ యువతను మోసగాళ్లు నమ్మిస్తున్నారు. ఇప్పటికే కొంత మందిని ఎన్‌ఎఫ్‌ఏలుగా ఎంపిక చేసినట్టు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఎవరికి ఏ సచివాలయం కేటాయించేది వారం రోజుల్లో సమాచారం వస్తుందని వారు చెబుతున్నారు. ఈ నియామకాలకు ఒక్కొక్కరి నుంచి రూ.రెండు లక్షలు వసూలు చేశారు. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు రూ.లక్షలు చెల్లించిన నిరుద్యోగులు ఏ సచివాలయం కేటాయిస్తారో?, ఎప్పుడు విధుల్లో చేరాలో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా భారత్ సేవక్ సమాజ్, సమగ్ర శిక్ష పేరిట నకిలీ ఉత్తర్వులతో విద్యాశాఖలో పలు ఉద్యోగాలు భర్తీ చేశారని ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో తమ పరిస్థితి ఏమిటని వ్యవసాయశాఖలో ఎన్‌ఎఫ్‌ఏ ఉద్యోగాల కోసం రూ.లక్షలు నగదు చెల్లించిన నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
మధ్యవర్తులదే హవా
ప్రభుత్వ పాఠశాలలు, వ్యవసాయశాఖలో నకిలీ ఉత్తర్వులతో ప్రైవేటు వ్యక్తులు చేపట్టిన నియామకాల్లో మధ్యవర్తుల హవా సాగింది. ప్రైవేటు వ్యక్తులు స్థానిక యువతలో నమ్మకాన్ని పెంచేందుకు స్థానికులను ఏజెంట్లుగా పెట్టుకున్నారు. ఒక ఉద్యోగానికి నిరుద్యోగి చెల్లించిన నగదులో 50 శాతం మధ్యవర్తులకు అందజేసినట్టు తెలిసింది. దీంతో మధ్యవర్తులు నిరుద్యోగుల వివరాలు సేకరించి ప్రైవేటు వ్యక్తుల సహకారంతో నకిలీ ఉత్తర్వులు అందజేసి సొమ్ము చేసుకున్నారు. గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కిరాణా వ్యాపారి, పాఠశాల పీఎస్‌హెచ్‌ఎం, వైసీపీ జిల్లా నాయకుడు దీనికి సూత్రధారులుగా వ్యవహరించారని తెలిసింది. కాగా ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించగా, రూ.లక్షలు చెల్లించి నకిలీ ఉద్యోగాల్లో చేరిన గిరిజన యువత మధ్యవర్తులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో భారత్ సేవక్ సమాజ్ అధికారులు.. కలెక్టర్, విద్యాశాఖ కమిషనర్‌తో చర్చిస్తున్నారని, ఏ ఒక్క ఉద్యోగం పోదంటూ వారు తప్పుడు ప్రచారానికి తెరతీశారు.