Share News

రూ.66 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

ABN , Publish Date - Oct 31 , 2026 | 01:10 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నగరంలో రూ.66 లక్షల నకిలీ నోట్లు, డమ్మీ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

రూ.66 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం

డమ్మీ తుపాకీ కూడా... నలుగురి అరెస్టు

మహారాణిపేట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో పోలీసులు నగరంలో రూ.66 లక్షల నకిలీ నోట్లు, డమ్మీ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి శుక్రవారం మహారాణిపేట స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కె.లక్ష్మణమూర్తి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 28వ తేదీ రాత్రి మహారాణిపేట ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు లాడ్జిలు, హోటళ్లలో సోదాలు చేపట్టారు. జగదాంబ జంక్షన్‌లోని ‘వి’ స్టార్‌ హోటల్‌లో అరకులోయ మండలం డోమలజోరు గ్రామానికి చెందిన పాంగి కొండబాబు (26), పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి వాసి బెవర సాయి (25), అదే జిల్లా మక్కువ మండలం పెదవలస గ్రామస్థుడు వెలగడ దినేష్‌ (23), సాలూరు పెదవీధికి చెందిన ఇజ్జవరపు దుర్గాప్రసాద్‌ (24)లు ఉండగా వారి బ్యాగ్‌లను తనిఖీ చేశారు. ఒక బ్యాగ్‌లో రూ.66 లక్షలు (500 రూపాయల కలర్‌ జెరాక్స్‌ కాపీలు...200 కట్టలు) లభ్యమయ్యాయి. మరో బ్యాగ్‌లో డమ్మీ తుపాకీ దొరికింది. పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నకిలీ తుపాకీని, నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వారు సుమారు నాలుగు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమయ్యారు. వారు నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్నారని, ఆ సమయంలో ఎవరైనా ప్రతిఘటిస్తే డమ్మీ తుపాకీతో బెదిరించేవారని విచారణలో తేలింది. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం గతంలో విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఇలాంటి లావాదేవీలు జరిపారు. వీరి ముఠాకు సంబంధించి ప్రధాన నిందితుడు సహా ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఏసీపీ లక్ష్మణమూర్తి పేర్కొన్నారు.


మద్యం దుకాణాలకు సీల్‌

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ పోలింగ్‌ నేపథ్యంలో నగరంలోని మద్యం దుకాణాలను అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం విక్రయాలను నిలిపేయాల్సి ఉంటుంది. దీంతో ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ పి.ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది మద్యందుకాణాలకు సీల్‌ వేశారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఆదివారం సాయంత్రం తిరిగి దుకాణాలను తెరిచి విక్రయాలు జరుపుకునేందుకు అవకాశం ఇస్తారు


రేపు చేపలు, మాంసం దుకాణాలు బంద్‌

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలో మాంసం, చేపలు విక్రయించే దుకాణాలు మూసివేయాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. నవంబరు ఒకటో తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటాం కాబట్టి మాంసం, చేపలు విక్రయాలను నిషేధిస్తున్నామన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


89.98 శాతం మందికి పింఛన్లు పంపిణీ

విశాఖపట్నం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):

సామాజిక పింఛన్లు జిల్లాలో 1,56,132 మందికిగాను 1,40,492 మందికి (89.98 శాతం) శుక్రవారం పంపిణీ చేశారు. నవంబరు ఒకటో తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున రెండు రోజులు ముందుగా పింఛన్లు పంపిణీ ప్రారంభించారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 25,906 మందికిగాను 23,869 మందికి (92.14 శాతం) రూ.10.04 కోట్లు, నగర పరిధిలో 1,30,226 మందికిగాను 1,16,623 మందికి రూ.51.36 కోట్లు పంపిణీ చేశారు. మిగిలిన వారికి రానున్న రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని డీఆర్‌డీఏ పీడీ బెందాళం లక్ష్మీపతి తెలిపారు.

Updated Date - Oct 31 , 2026 | 01:10 AM