Share News

నాణ్యమైన విద్యుత్తుతో పరిశ్రమలు రాక

ABN , Publish Date - Oct 06 , 2026 | 01:23 AM

నాణ్యమైన నిరంతర విద్యుత్‌ సరఫరా, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

నాణ్యమైన విద్యుత్తుతో పరిశ్రమలు రాక

  • ఎస్‌ఈజడ్‌లో మరో మూడు విద్యుత్‌ ఉపకేంద్రాలు, కొత్త లైన్లు

  • మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

  • సెజ్‌లో ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్‌ ఉపకేంద్రం ప్రారంభం

  • గత ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ధ్వజం

అచ్యుతాపురం/ రాంబిల్లి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):

నాణ్యమైన నిరంతర విద్యుత్‌ సరఫరా, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ప్రత్యేక ఆర్ధిక మండలి (సెజ్‌)లో ఏపీ ట్రాన్స్‌కో రూ.77.29 కోట్ల వ్యయంతో నిర్మించిన 220/132/22 కేవీ గ్యాస్‌ ఇన్స్యులేటెడ్‌ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి రావడం వల్ల అన్ని కేటగిరీల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో భవిష్యత్‌ పారిశ్రామిక విద్యుత్‌ అవసరాల కోసం ప్రభుత్వ రూ.1.816 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈప్రాంతంలో మరో మూడు విద్యుత్‌ ఉపకేంద్రాలు నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.

గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసిందని, విద్యుత్‌ చార్జీలను విపరీతంగా పెంచేసి వినియోగదారులతో పెనుభారం మోపిందని రవికుమార్‌ ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్‌ చార్జీలు పెంచకపోగా.. గత ప్రభుత్వం పెంచిన చార్జీలను తగ్గించామని గుర్తు చేశారు. విద్యుత్‌ రంగాన్ని గాడిలోపెట్టడంతో సాధారణ వినియోగదారులతోపాటు పరిశ్రమలకు కూడా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు. పటిష్ఠమైన విద్యుత్‌ వ్యవస్థ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. లైన్‌మెన్‌ కొరతను తీర్చేందుకు 629 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేశామని, ప్రస్తుతం ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, ఏపీఆర్‌డీసీ చైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు, ఏపీ ట్రాన్స్‌కో అధికారులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 01:23 AM